మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు: 25 నుంచి ఈ నియోజకవర్గాల్లో ప్రచారం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు వస్తున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
నవంబర్ 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ ప్రచార సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రోడ్‌షోకు హాజరవుతారు. ప్రధాని మోడీతో ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

అవినీతిలో ఒలింపిక్స్ ఉంటే బీఆర్ఎస్ సర్కారే విజేత: ఫడ్నవీస్
కేసీఆర్ సర్కారుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసిందని ఆరోపించారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్నారు. అవినీతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారని.. మొదట టీఆర్ఎస్ అని, ఇప్పుడు బీఆర్ఎస్ అని మారిందన్నారు. దీనికి బదులు ఎఫ్ఆర్ఎస్ అని ఫ్యామిలీ రాజ్ సమితి అని పేరు పెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. దళిత సీఎం అని కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితుల పేరు చెప్పి పథకాలు తీసుకొచ్చి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామనే హామీని విస్మరించారని మండిపడ్డారు.
తాను మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నదీ జలాలను విడుదల చేయాలని కోరారని.. పక్క రాష్ట్రం తెలంగాణకు నీటిని విడుదల చేశామని.. అయితే ఈ నీటిని వ్యవసాయానికి కాకుండా అవినీతికి వాడుకుంటాడని నాకు ఇప్పుడు తెలియదని ఫడ్నవీస్ ఆరోపించారు. బీఆర్ఎస్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందన్నారు. కేసీఆర్ తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రకటనల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications