తెలంగాణకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ: తెలుగులో ట్వీట్, బీజేపీలో సరికొత్త ఉత్సాహం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (అక్టోబర్ 3)నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం నిజామాబాద్‌లో జరగబోయే మోడీ సభను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
సభకు రైతులను, మహిళలను భారీగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో రైతులు కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వస్తారని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ప్రధాని మోడీకి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో బదులివ్వడం గమనార్హం. తమకు రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.

మహిళా బిల్లుకు ఆమోదం లభించడంతో మహిళలతో ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌లో జరగబోయే సభ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారన్న నేపథ్యంలో జన సమీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పార్టీ పరంగా బహిరంగ సభతో పాటు అధికారిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ఎస్‌పీజీ అధికారులు సభ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభ నిర్వహిస్తున్న మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. రాబోయే ఎన్నికలకు మోడీ సభ కీలకమవుతుందని జిల్లా నాయకులు భావిస్తున్నారు.
మోడీ ప్రారంబించనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు:
నిజామాబాద్ పర్యటనలో రూ. 8,021కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తారు.
రామగుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.
అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతను ఈ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది.
ఈ ప్రాజెక్టులో బొగ్గు వినియోగం తక్కువ.. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది.
1360 కోట్లతో 496 బస్తీ దావాఖానాలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మోడీ ప్రారంభిస్తారు.
అలాగే ప్రతీ జిల్లాలో నిర్మించే పనులను మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు అంకితం చేస్తారు.
కాగా, కొమురవెల్లి దేవస్థానం వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
మన రైతుల శ్రేయస్సు,సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా, మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం.
— Narendra Modi (@narendramodi) October 2, 2023
మన పసుపు రైతులకు… https://t.co/xYazlleO07
ప్రధాని మోడీ నిజామాబాద్ షెడ్యూల్ ఇలా
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు.
మంగళవారం మధ్యాహ్నాం 2:10 నిమిషాలకు.. బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.
2:55 నిమిషాలకు.. బీదర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు.
3:00 నుంచి 3:35 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.
3:45 నుంచి 4:45 గంటల వరకు పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు.
4:55 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5:45 గంటలకు బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న మోడీ.. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
కాగా, అక్టోబర్ మొదటివారంలోని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications