లైంగిక వాంఛ తీర్చలేదని 12 ఏళ్ల బాలికను చంపేసిన కామాంధుడు
హైదరాబాద్: 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేసిన సంఘటన నగరంలోని భవానీ నగర్‌లో చోటు చేసుకుంది. స్ధానికుల సహకారంతో నిందితుడిని పోలీసులు పది రోజులకు పట్టుకున్నారు.
బాలికను అత్యంత కిరాతకంగా చంపారన్న విషయంపై స్పష్టత లేకపోవడం, ఆమె కుటుంబ సభ్యులకు ఎవరిపైనా అనుమానం లేకపోవడంతో హంతకుడిని గుర్తించడం చాలా క్లిష్టంగా మారింది. సంఘటనా స్ధలానికి సమీపంలో సీసీ కెమెరాలో ఉన్న అస్పష్టమైన ఆధారాలతో హతురాలి బంధువులు, స్ధానికులు పాతబస్తీ మొత్తం జల్లెడ పట్టారు.
రెండు రోజుల క్రితం హంతకుడిని గుర్తించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను నేరం చేశానని నిందితుడు అంగీకరించడంతో శుక్రవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముకునే దస్తగిరి (22) భవానీ నగర్‌లోని ఆమన్ నగర్-బీలో నివాసముంటున్నాడు. అతడి నివాసానికి ఆరు ఇళ్ల అవతల 12 ఏళ్ల బాలిక నివాసముంటోంది.
ఆగస్టు 11వ తేదీన రాత్రి 7.15 గంటలకు కూరగాయలు, మాంసం తెచ్చేందుకు బాలిక బయటకు వచ్చింది. అదే సమయంలో దస్తగిరి బయటకు వచ్చాడు. కూరగాయాలు, మాంసం తీసుకుని ఇంటికి వెళ్తున్న బాలికను పిలిచాడు. బాలిక రాకపోవడంతో పనుంది రావాలంటూ పిలిచాడు.
సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్న భవనంలోనికి బాలికను తీసుకెళ్లాడు. లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. తన పిన తండ్రికి చెబుతాను, గట్టిగా అరుస్తానంటూ బాలిక ప్రతిఘటించడంతో నిన్ను చంపేస్తానంటూ దస్తగిరి బాలిక ధరించిన చున్నీని ఆమె మెడకు బిగించి ఉరేశాడు.
శ్వాస ఆడక బాలిక చనిపోయింది. మృతదేహాన్ని నీటి సంపులో వేసి గట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. తన కూతురు కనిపించలేదంటూ బాలిక తల్లి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల అనంతరం కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న బాలిక శవాన్ని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications