
చిన్నజీయర్ స్వామిపై అట్రాసిటీకేసు పెట్టాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు; మండిపడిన సీపీఐ నారాయణ, అశ్వనీదత్
గిరిజన ఆరాధ్యదైవాలైన సమ్మక్క సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. చిన్న జీయర్ స్వామి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దిష్టి బొమ్మల దహనాలు, చిన్న జీయర్ ఫొటోకు చెప్పుల దండలు వేసి తమ నిరసన తెలియజేస్తున్నారు.
Recommended Video


చిన్న జీయర్ స్వామిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఇక ఇదే సమయంలో చిన్న జీయర్ స్వామి మేడారం సమ్మక్క సారలమ్మ లపై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన, వనదేవత లైన సమ్మక్క, సారలమ్మలను అవమానించేలా చిన్న జీయర్ స్వామి మాట్లాడారని, ఆయన మాట్లాడిన వీడియోతో సహా పోలీసులకు ఇచ్చి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

జనాల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసే చరిత్ర చిన్న జీయర్ స్వామిది
ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షుడు మల్లు దొర మాట్లాడుతూ ఆదివాసి ఆడబిడ్డ చరిత్ర తెలియని చిన్న జీయర్ కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. జనాల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసే చరిత్ర చిన్న జీయర్ స్వామిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

చిన్న జీయర్ వ్యాఖ్యలపై అశ్వనీదత్ ఘాటు వ్యాఖ్యలు
ఇక చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ స్టార్ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్మక్క సారలమ్మ ల పై చిన్న జీయర్ స్వామి కి చేసిన కామెంట్లు చాలా బాధ కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న జీయర్ స్వామి ఓ వెధవ అంటూ, బ్లాక్ టికెట్లు అమ్ముకునే సన్నాసి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే చిన్న జీయర్ స్వామి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు .

చిన్న జీయర్ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందన ఇదే
ఇదిలా ఉంటే చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను సిపిఐ నేత నారాయణ ఖండించారు. స్వామి సమ్మక్క సారక్క ల పై చేసిన వ్యాఖ్యలను జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు . తక్షణమే ఈ చిన్న జీయర్ స్వామి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఖండించాలి అన్నారు సిపిఐ నారాయణ. సమ్మక్క-సారలమ్మలను అవమానించేలా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దారుణమని సిపిఐ నేత నారాయణ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న జీయర్ స్వామి వెంట ఉన్నారని ఆరోపించారు. ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి చిన్న జీయర్ స్వామి అని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. తక్షణం ఆయన సమ్మక్క సారలమ్మ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.