సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ లొల్లి.. కాల్పులు జరిపిన పోలీసులు !!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరుకు ఎండ్ కార్డ్ పడింది. మూడో విడత సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తయ్యి ఫలితాలు వచ్చేశాయి. మొత్తంగా 4,159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి (రాత్రి 12.30 గంటల వరకు) కాంగ్రెస్ మద్దతుదారులు 2,286 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఐ మద్దతుదారులు 24 చోట్ల, సీపీఎం వారు 7 చోట్ల గెలిచారు. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కాగా జనగామ, యాదాద్రి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లిలో కాల్పుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సర్పంచ్ ఎన్నిక ఫలితాలు అనౌన్స్ చేసిన తర్వాత పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం ఏంటని జోరుగా చర్చ నడుస్తోంది. అయితే అందుకు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే..?
పంచాయతీ ఎన్నికల్లో పైడిపల్లి సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారు గంగుల మంగ గెలిచారు. దీంతో బీజేపీ మద్దతుదారు అయిన మమత రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఆమె ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు.
ఇక తొలిదశలో 4,227 స్థానాలకు ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2,331 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే బీఆర్ ఎస్ 1,168 స్థానాల్లో.. బీజేపీ 189 స్థానాల్లో విజయం సాధించగా.. ఇతరులు 539 స్థానాల్లో గెలుపొందారు. రెండో దశలో 4325 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 2245 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్‌ఎస్ 1,188 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 268 స్థానాల్లో, ఇతరులు 624 స్థానాల్లో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications