బాబు ఎవరినైనా చంపేస్తారు! నార్కో టెస్ట్ చేయాలి, నా ఓటు జగన్‌కే కానీ: ఊగిపోయిన పోసాని
హైదరాబాద్/అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సినీ ప్రముఖుడు పోసాని కృష్ణ మురళీ సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు పదవుల కోసం ఎవరినైనా చంపేస్తారని (రాజకీయంగా) దుమ్ము దులిపారు. గతంలో బీజేపీతో దోస్తీ చేయలేదా అన్నారు. కమ్యూనిజం కంటే టూరిజం గొప్పదా అన్నారు. జగన్‌పైన అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. మోడీలో ఏం మార్పు కనిపించిందో చెప్పాలన్నారు.
చంద్రబాబుకు జగన్ ఏం ద్రోహం చేశారని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆయనను ఎందుకు టార్గెట్ చేసుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన అవసరాల కోసం ఎవరినైనా వాడుకుంటారని చెప్పారు. రాజకీయాల్లో సీనియారిటీ కంటే సిన్సియారిటీ చాలా ముఖ్యమని చెప్పారు. చంద్రబాబు కమ్మ, కాపుల మధ్య గొడవ పెడుతున్నారన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆయన ఎవరితోనైనా కలుస్తారని, ఆ తర్వాత విలువలు లేవంటారన్నారు.

ఎన్టీఆర్ జీవితాన్ని లాక్కున్నారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా తన వైపుకు తిప్పుకున్నారని చంద్రబాబుపై పోసాని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎన్టీఆర్ జీవితాన్ని లాక్కున్నారన్నారు. అభివృద్ధి పేరుతో పార్టీనే చంద్రబాబు మరిచిపోయాడా అని ఎద్దేవా చేశారు. అసలు అది ఎలాంటి అభివృద్ధి అన్నారు. కమ్యూనిస్టులు, ముస్లీంలు, బీజేపీ, కేసీఆర్‌తో కలవడం గెలిచాక వారిని తిట్టడం ఇదే చంద్రబాబు తీరు అన్నారు.

బాబుకు ఓటేస్తే కమ్మవాడికి ఓటేసినట్లే
వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లు టీడీపీ నేతలు అంటున్నారని, మరి నేను అంటానని, టీడీపీకి ఓటు వేస్తే కమ్మ వారికి ఓటు వేసినట్లు అంటానని పోసాని అన్నారు. వామపక్షాలతో కలుస్తారు, ఆ తర్వాత వారిని తిడతారు, మైనార్టీలతో ఓట్లు వేయించుకొని మరిచిపోతారు, బీజేపీతో కలుస్తారు, ఆ తర్వాత తిడతారు.. ఇదేం తీరు అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు బీజేపీని తిట్టిన చంద్రబాబు మళ్లీ 2014లో కలిశారన్నారు.

ఎన్టీఆర్‌ను చంపినందుకు చంద్రబాబుపై కేసు ఉందా?
ఎన్టీఆర్‌కు విలువలు లేవన్నారని, వాజపేయితో కలిసి ఆ తర్వాత ఆయనకు విలువలే లేవన్నారని, వామపక్షాలతో కలిసి వారికి విలువలు లేవన్నారని, ఇప్పుడు బీజేపీతో కలిసి వారికి విలువలు లేవంటున్నారని చంద్రబాబుపై పోసాని దుమ్మెత్తి పోశారు. సమైక్యాంధ్ర కోసం గొంతు కోసుకున్నావా అని ప్రశ్నించారు. చంద్రబాబు పదేపదే అబద్దాలు చెబుతూ పరిపాలిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ను చంపినందుకు చంద్రబాబుపై కేసు ఉందా అని ప్రశ్నించారు.

నీ సీటు కోసం రాజకీయంగా ఎవరినైనా చంపేస్తావా
నీ సీటు కోసం రాజకీయాల్లో రాజకీయంగా ఎవరినైనా చంపేస్తావా అని చంద్రబాబుపై పోసాని నిప్పులు చెరిగారు. గతంలో ఎన్టీఆర్‌కు విలువలు లేవని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మహానాడులో ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కమ్మ కులంలో పుట్టినప్పటికీ ఆయన ప్రజల కోసం పని చేశారన్నారు. పదవి కోసం చంద్రబాబు ఎవరి గొంతునైనా కోస్తారన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు తిట్టినప్పుడు కమ్మవాళ్లంతా ఏం చేశారన్నారు.

చంద్రబాబుకు నార్కో టెస్టులు చేయాలి
జగన్ వేల కోట్లు తిన్నారని ఏపీ సీఎం పదేపదే అంటున్నారని, ఆయన తిన్నట్లు నిరూపిస్తే తాను చంద్రబాబు ఫోటోను మెడలో వేసుకుంటానని పోసాని అన్నారు. చంద్రబాబుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నార్కో టెస్టులు చేద్దామన్నారు. చంద్రబాబుపై 15 కేసులు ఉంటే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. 15సార్లు స్టే ఎలా తెచ్చుకున్నావని ప్రశ్నించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి పైన కూడా ఇన్ని స్టేలు లేన్నారు. జగన్ ఎదగకుండా చంద్రబాబు ఆయనపై పడ్డారన్నారు. జగన్‌పై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇప్పుడున్న నాయకుల్లో జగన్ బెట్టర్ అన్నారు. జగన్‌ను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను జగన్‌కే ఓటు వేస్తానని చెప్పారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబులా తాను అబద్దాలు చెప్పలేనని జగన్ చెప్పారని, మంచి ప్యాకేజీ ఇస్తానని మాత్రం చెప్పారన్నారు.

నాకు ఎలాంటి పదవులు వద్దు
తాను జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతుండటంతో పదవులు ఆశిస్తున్నానని భావిస్తారని, కానీ తనకు ఏ పదవులు అవసరం లేదని పోసాని స్పష్టం చేశారు. తాను జీవితంలో ఏ పార్టీలో చేరనని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేయనని, ఎంపీగా పోటీ చేయనని, రాజ్యసభ సహా ఇతర ఏ పదవులు తీసుకోనని చెప్పారు. ఎలాంటి రాజకీయ పదవులు తీసుకోనని చెప్పారు. ఓటరుగానే ఉంటానని తెలిపారు. నేను ఇప్పుడు మాట్లాడుతోంది కూడా ఓటరుగానే అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!