ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు .. నిరసనలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పిలుపు; టెన్షన్!!
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వేళ వరంగల్ జిల్లాలో పోస్టర్ల కలకలం కొనసాగుతుంది. ఇప్పటికే మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ క్రమంలో వరంగల్ నగర వ్యాప్తంగా మోడీ పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఓరుగల్లులో ప్రస్తుతం మోడీ పర్యటన నేపధ్యంలో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది.
నేను వరంగల్, నాది తెలంగాణా పేరుతో వెలసిన పోస్టర్లలో తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిలదీశారు. తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు అమలు చెయ్యకుండా మోసం చేశారని ప్రధాని మోడీ పర్యటనను టార్గెట్ చేశారు. తెలంగాణా రాష్ట్రానికి ఇస్తామని హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ ఎక్కడ అంటూ పోస్టర్ లలో ప్రశ్నించారు.

అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. తెలంగాణాకు అడుగడుగునా అన్యాయం చేస్తూ మోడీ ఎందుకు వరంగల్ వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్రంలో కాజీ పేటకు ఇస్తామని చెప్పిన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని, తమకు వ్యాగన్ ఫ్యాక్టరీ అవసరం లేదని వారు డిమాండ్ చేస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ కాకుండా వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు.
దేశంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను బీజేపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. తెలంగాణా రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు మోడీ పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్, బీజేపీ నేతలను నిరసనలకు పిలుపునిచ్చిన నేపధ్యంలో పోలీసులు ఎవరూ ఎటువంటి నిరసనలకు దిగకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అనుమానితులను అరెస్ట్ లు చేస్తున్నారు. మోడీ పర్యటనకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా 30 ఏళ్ళ తర్వాత వరంగల్ కు ఎన్నికల ముందు వస్తున్న మోడీ పర్యటన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఆగ్రహానికి కారణంగా మారుతుంది.












Click it and Unblock the Notifications