తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు నోఎంట్రీ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాటలో పయనిస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
"అవసరమైతే మేమే పిలుస్తాం... ప్రభుత్వాధికారులు కలవాలనుకుంటే అనుమతి తీసుకోవాల్సిందే" అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గురవారం తీర్మానించిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం వచ్చిన వెంటనే, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసేందుకు చర్యలు తీసుకుంది.

"అయినా ఎప్పుడూ ఈ మీడియా గోలేంది? ఇక్కడ వాళ్లేకం పని?" అని గురువారం కేసీఆర్, అధికారుల వద్ద అసహనం వ్యక్తం చేశారట. "అవసరమైతే మనమే వారిని పిలుద్దాం. అవసరం లేనప్పుడు వారినెందుకు సచివాలయంలోకి అనుమతించాలి" అని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలోకి మీడియా ప్రవేశాన్ని నిషేధిస్తూ నేడో, రేపో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది.
కేసీఆర్‌కు నివేదిక:
ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో మీడియాను సచివాలయంలోకి అనుమతించడం లేదని, సమావేశాలున్న సమయంలోనే పిలుస్తున్నారని, ఇదే పద్ధతిని సచివాలయంలో అమలు చేయాలని ఇద్దరు మంత్రులు, పలువురు అధికారులు సీఎంను కోరారు.
మీడియా ప్రతినిధులు నిత్యం మంత్రుల ఛాంబర్ల వద్ద ఉండడం వల్ల రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని సీఎంకు మంత్రులు, ముఖ్య అధికారులు ఫిర్యాదు చేశారు. మంత్రులు, కార్యదర్శులు వెళ్లే లిప్టుల్లోకి చొరబడి ఇబ్బంది పెడుతున్నారని, సచివాలయానికి ఎవరు వచ్చినా వారు సీఎంను కలిసి చర్చించారనే తప్పుడు వార్తులు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఇటీవల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో చాలా మంది అధికారులు మీడియా ప్రతినిధులతో పడుతున్న బాధలను సీఎంకు వివరించారు. మీడియా పేరిట చాలా మంది సచివాలయంలోకి వస్తున్నారని, వారిలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం కష్టంగా ఉందని పేర్కొన్నారు.
నిత్యం 20 న్యూస్ ఛానళ్లు, పదిహేను దినపత్రికలు, ఇతర పక్ష పత్రికలు, ఇంటర్ నెట్ న్యూస్ వెబ్ సైట్ల విలేకరులు, వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు అంతా 200 మందికి పైగా సచివాలయానికి వస్తున్నారని వివరించారు.
విభజన తర్వాత తెలంగాణకు నాలుగు భవనాలు మాత్రమే వచ్చాయని, పార్కింగ్ స్ధలం, మంత్రులు, అధికారుల కార్యాలయాల ఇరుకుగా మారాయని అన్నారు. గతంలో నరేంద్రమోడీ సీఎంగా ఉన్నప్పుడు ఇదే పద్ధతిని పాటించారని, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఇదే అమలు జరుగుతోందని, కేంద్రంలోనూ సౌత్, నార్త్ బ్లాకుల్లోకి మీడియాను అనుమతించడం లేదని సీఎంకు చెప్పారు.












Click it and Unblock the Notifications