నవంబర్ 3నుండి ప్రైవేట్ కళాశాలలు బంద్..రేవంత్ సర్కార్ కు అల్టిమేటం!
వచ్చేనెల ఒకటో తేదీలోపు ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని లేదంటే నవంబర్ 3 నుండి డిగ్రీ, పీజీ కాలేజీలతో పాటు ప్రొఫెషనల్ కాలేజీలను కూడా నిరవధికంగా మూసివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం 900 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాలలను ఇబ్బందికి గురి చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
తెలంగాణా ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలల డిమాండ్
దసరా, దీపావళి పండుగకు ముందే మొత్తం 1200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు కేవలం 300 కోట్ల రూపాయలను మాత్రమే రిలీజ్ చేశారని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ బాధ్యులు పేర్కొన్నారు. 900 కోట్ల రూపాయలను రిలీజ్ చేయాల్సి ఉందని, నవంబర్ ఒకటవ తేదీ వరకు రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆ పని చెయ్యాలని విజ్ఞప్తి
2024 25 అకాడమిక్ ఇయర్ వరకు పెండింగ్లో ఉన్న తొమ్మిదివేల కోట్ల బకాయిలను వచ్చే ఏడాది మార్చి 31లోగా చెల్లించడానికి రోడ్ మ్యాప్ ను ప్రకటించాలని దానిని కచ్చితంగా అమలు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా నెరవేర్చకపోతే మార్చి, ఏప్రిల్ నెలలో జరిగే ఫైనల్ పరీక్షలను కూడా బాయ్ కాట్ చేస్తామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హెచ్చరికలు జారీచేశారు.
నవంబర్ 3వ తేదీ నుండి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరికలు
నవంబర్ ఒకటవ తేదీ లోగా ప్రభుత్వ సానుకూలంగా స్పందించి తమకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తుందని భావిస్తున్నామని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. బకాయిలు అడిగితే, విజిలెన్స్ తనిఖీలతో బెదిరిస్తున్నారని, బెదిరింపులకు భయపడేది లేదని వారు తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే మూడవ తేదీ నుండి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
భారీ బహిరంగ సభలు, లాంగ్ మార్చ్ లు
మూడు లక్షల మందితో ఓఆర్ఆర్ శివారులో భారీ బహిరంగ సభ పెట్టి, నిరవధికంగా కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించారు. అప్పటికి న్యాయం జరగకపోతే 10 లక్షల మందితో హైదరాబాద్ కు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications