రేవంత్ ఎందుకిలా, సరి చేసుకోవాల్సిందే - తేల్చేసిన రాహుల్..!!
తెలంగాణలో అధికారంలోకి రావాల్సిందేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ఫిర్యాదులు...వివాదాలు పక్కన పెట్టాలని స్పష్టం చేసారు. సీనియర్లను కలుపుకోవాల్సిందేనని.. అందరూ సమిష్టిగా పని చేసి పార్టీని అధికారంలోకి తేవాలని నిర్దేశించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ కలిసిన సమయంలో పార్టీ వ్యూహకర్త సునీల్ టీం ఇచ్చిన నివేదికల ఆధారంగా పలు అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రేవంత్ కు రాహుల్ కీలక సూచనలు చేసారని తెలుస్తోంది.
తెలంగాణపై రాహుల్ ఫోకస్
తెలంగాణలో ఎన్నికలను ఈ సారి రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ నియోజకవర్గంలో వెనుకబడి ఉన్నట్లుగా వచ్చిన నివేదికల పైన ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ పట్ల ఆదరణ ఉన్నా..నేతల తీరు ఆశాజనకం లేదనే నివేదికలను రాహుల్ ప్రస్తావించారని పార్టీలో చర్చ జరుగుతోంది.

రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి లోక్ సభతో పాటుగా కొడంగల్ లోనూ మద్దతు విషయంలో వెనుకబడి ఉన్నట్లు వచ్చిన నివేదికలతో రాహుల్ అప్రమత్తంగా చేసారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందరు నేతలను సమన్వయం చేసుకోవాల్సిందేనని రాహుల్ తేల్చి చెప్పారని ఢిల్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
సర్వేల్లో రేవంత్ వెనుకంజ
కర్ణాటకలో కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా పని చేయటం ద్వారా అధికారంలోకి వచ్చిన అంశాన్ని రాహుల్ గెలుపు వ్యూహంలో ప్రధాన అంశంగా గుర్తించారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ కు అదే విషయాన్ని స్పష్టం చేసారు. పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలు..ఈగోలతో వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేసారని పార్టీలో చర్చ జరుగుతోంది. రేవంత్ పైన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేసారని సమాచారం. ఈ అంశం పైన రాహుల్ నేరుగా రేవంత్ ను నిలదీసినట్లు చెబుతున్నారు.
దిశా నిర్దేశం చేసిన రాహుల్
మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల పై రాహుల్ గాంధీ వద్ద ఆసక్తికర చర్చ జరిగిందని తెలుస్తోంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ వెనుకబడి ఉన్నట్లు సర్వే నివేదికలు అందినట్లు తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో ప్రభావం చూపే నేతలు పార్టీ వీడటం పైన చర్చ జరిగిందని సమాచారం. అందరినీ కలుపుకు వెళ్లాలని రేవంత్ కు రాహుల్ గట్టిగానే సూచన చేసారని పార్టీలో చర్చ జరుగుతోంది.

పార్టీకి వ్యూహకర్తగా పని చేస్తున్న సునీల్ టీం కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితులపై ఇచ్చిన నివేదిక ఆధారంగా రాహుల్ ప్రశ్నించారని ప్రచారం. తెలంగాణలో పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పిన రాహుల్ గాంధీ..నేతల్లో సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు. రాహుల్ తెలంగాణలో క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన సమాచారం సేకరిస్తుండటంతో పార్టీ నేతలు అలర్ట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications