మండుటెండల్లో తెలంగాణాకు వరుణుడి హెచ్చరిక... మూడురోజులు వర్షాలు!
తెలంగాణాలో ఒకపక్క ఈ నెలలోనే ఎండలు మండుతున్న తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. శ్రీలంక సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. అయితే భారీ వర్షాలకు అవకాశం లేదని, తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ రోజుల్లో కొన్ని జిల్లాలలో వర్షాలు
ఈ నెల 22, 23, 24 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం నుంచి తేమ గాలులు అల్పపీడనం వైపు కదులుతుండడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో ఈ సారి ఎండలు కూడా గతం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెప్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
నిన్న భద్రాచలంలో 1.1 డిగ్రీలు పెరిగి 36.2°Cగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి, ఖమ్మంలో 2.3 డిగ్రీలు పెరిగి 35.4°Cగా నమోదైంది. ఆదిలాబాద్‌లోనూ 1.6 డిగ్రీల పెరుగుదలతో 35.8°C ఉష్ణోగ్రత రికార్డయింది. మెదక్ మినహా తెలంగాణ వ్యాప్తంగా గాలిలో తేమ 35-42% మధ్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొందని అధికారులు వెల్లడించారు.
అప్పుడే మొదలైన ఏసీలు, కూలర్ల వినియోగం
తెలంగాణలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగాల్సి ఉండగా, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే వేడి గాలులు, ఎండ తీవ్రత మొదలయ్యాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.
ఎండలకు జాగ్రత్త అంటున్న వైద్యులు
ప్రస్తుతం పెరుగుతున్న వేడి దృష్ట్యా వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. వచ్చే ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. అత్యవసరమైతే కాటన్ దుస్తులు, టోపీ లేదా గొడుగు వాడాలి. డీహైడ్రేషన్ ప్రమాదం ఉన్నందున, తేలికపాటి ఆహారం, పండ్ల రసాలు తీసుకోవాలి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండి, తరచుగా నీరు తాగి డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications