వర్ష బీభత్సం.. తెలంగాణాలో 13మంది మృతి; అనేక కుటుంబాలలో తీరని విషాదం!!
తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి . రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ప్రాణాలను తీశాయి. నిన్న అనేక జిల్లాలలో తీవ్రమైన ఎండలు ఉండగా, కొన్ని జిల్లాలలో మాత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలు, ఈదురు గాలులు దెబ్బకు అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.
విరుచుకుపడిన వర్షాలు, ఈదురుగాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం , రెమాల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. అప్పటివరకు ఎండలు, అంతలోనే వర్షాలు, ఈదురు గాలులు విరుచుకుపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే మొత్తం ఏడు మంది మృత్యువాత పడడం అత్యంత విషాదాన్ని మిగిల్చింది.

నాగర్ కర్నూలు లో ఏడుగురు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి షెడ్ కూలి నలుగురు, పిడుగుపాటుకు ఇద్దరు, ఒక డ్రైవర్ మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ శివారులో ఓ షెడ్ నిర్మాణంలో ఉండగా సాయంత్రం భారీ వర్షం కురియడంతో గోడ కూలింది. ఈ ప్రమాదంలో షెడ్ యజమాని మల్లేష్,కూతురు మనీషాతో పాటు మరో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
వర్ష బీభత్సంతో వణికిపోయిన నాగర్ కర్నూలు
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఇక తెలకపల్లిలో పిడుగు పాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. అలాగే నందివడ్డెమాన్ గ్రామంలోనూ ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, పాలెం, బిజినేపల్లి, తిమ్మాజిపేట, చెన్నపురావుపల్లి, కల్వకుర్తి, పదర, పెద్దూరు, తూడుకుర్తిలాంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ లో వర్ష బీభత్సం
ఇదిలా ఉంటే హైదరాబాద్లో మధ్యాహ్నం మూడు గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఇళ్ళు, వాహనాలపై భారీ చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. అనేకచోట్ల గోడలు కూలాయి. హైదరాబాద్ లో నిన్న వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు. మెదక్ జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సంతో ఇద్దరు మృతి చెందారు.
అనేకమంది కుటుంబాలలో విషాదం మిగిల్చిన వర్షం
హైదరాబాద్లోనూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారి పైన చెట్టు విరిగిపడడంతో ఘటనా స్థలంలో ఒకరు మృతిచెందగా, తీవ్ర గాయాలు పాలైన మరొక వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒక కారుపై చెట్టు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న కురిసిన అకాల వర్షాలు అనేకమంది కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చాయి.












Click it and Unblock the Notifications