వర్ష బీభత్సం; భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం అష్టదిగ్బంధం.. వీడియో!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలోని పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల్ వద్ద నిన్న ఉదయం నుంచీ ఈ ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా 616.5 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
వర్ష బీభత్సం; భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం అష్టదిగ్బంధం..!!#Bhupalapalli #MorachamPalli #TelanganaRains #Rains #Oneindiatelugu pic.twitter.com/NYRB19upok
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
దీంతో భూపాలపల్లి జిల్లాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భూపాలపల్లి మోరంచపల్లి గ్రామం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చింది. మోరంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మోరంచ పల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై మోరంచపల్లి వద్ద సుమారు 15 ఫీట్ల ఎత్తులో మోరంచ వాగు పొంగి ప్రవహిస్తోంది.

దీనితో 353సీ జాతీయ రహదారి పై వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన గణప సముద్రం 3 ఫీట్లు మేర మత్తడి పడుతుండం, ఆ నీరు కూడా మోరంచ వాగులో చేరటంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది. దీంతో వరద ముంపుకు గురై మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే బుధవారం రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.
బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు. చుట్టూ ఎటు వెళ్లలేని పరిస్థితిలో జల దిగ్బంధంలో చిక్కుకున్నారు మోరంచపల్లి వాసులు. వారు సహాయం కోసం అర్ధిస్తున్నారు. మోరంచ పల్లి వాసులను కాపాడటానికి అధికారులు వెళ్లాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. భూపాలపల్లి నుండి అధికారులు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు.
భూపాలపల్లి మైసమ్మ గుడి వద్ద వాగు ఉధృతి పెరగడంతో పాటు, మోరంచపల్లి వద్ద మోరంచ వాగు ఉధృతితో అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టమే. కేవలం హెలికాప్టర్ ద్వారానే ఆ ప్రాంత ప్రజలను కాపాడటానికి అవకాశం ఉంది. గంట గంటకు మోరంచ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తమను కాపాడాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ తమను కాపాడాలని ప్రాధేయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications