సీఎం కేసీఆర్ రైతుద్రోహి అన్న టికాయత్..టీఆర్ఎస్ దీక్షలో పాల్గొనటం వెనుక మతలబు అదేనా?
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బిజెపి సర్కార్ పై పోరాటాన్ని తీవ్రతరం చేశారు. ఢిల్లీ కేంద్రంగా సీఎం హోదాలో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. ఇక ఈ దీక్షలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు (బికెయు) రాకేష్ టికాయత్ పాల్గొనడం ఆసక్తికర పరిణామం గా చెప్పాలి. గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కెసిఆర్ ను రైతు ద్రోహిగా అభివర్ణించిన రాకేష్ టికాయత్ ఇప్పుడు అదే కెసిఆర్ తో కలిసి ఢిల్లీ వేదికగా సోమవారం నాడు సాగనున్న దీక్షలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో కెసీఆర్ సర్కార్ ను తిట్టిపోసిన రాకేష్ టికాయత్
గతంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ప్రారంభించిన ఉద్యమాన్ని కొనసాగించిన సమయంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రైతు దీక్షలో కెసిఆర్ సర్కారు తీరుపై రాకెట్ టికాయత్ విరుచుకుపడ్డారు .తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్, ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) భారతీయ జనతా పార్టీ "బీ టీమ్" అనిఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ను నమ్మొద్దు అంటూ విరుచుకుపడ్డ రాకేష్ టికాయత్
గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సమయంలో రాకేష్ టికాయత్ , కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఘాటుగా కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.రైతు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు రాకేష్ టికాయత్. కేసీఆర్ ను అసలే నమ్మొద్దని పేర్కొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన ప్రతి రైతుకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఇటీవల కేసీఆర్ చేసిన ప్రకటనపై రాకేష్ టికాయత్ తన ప్రసంగంలో ప్రశ్నించారు. అప్పుల బాధతో చనిపోతున్న తెలంగాణ రైతుల సంగతేంటి? అని రైతు నాయకుడురాకేష్ టికాయత్ సీఎంకేసీఆర్ ను సూటిగా నిలదీశారు.

ఢిల్లీలో కెసీఆర్ రైతు దీక్షకు రాకేష్ టికాయత్ మద్దతు
ఇక ఇప్పుడు సోమవారం న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన నిరసనకు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ మద్దతు తెలిపారు . తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని కేంద్ర ప్రభుత్వం సేకరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలో పాల్గొంటానని చెప్పారు.టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్న దేశమంతా ఒకే ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకాన్ని ప్రశంసించిన రాకేష్ టికాయత్ ఇది దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయమైన పథకం అని అన్నారు.

రైతు సంక్షేమం కోసం చేసే ఏ కార్యక్రమమైనా మద్దతు ఇస్తామన్న రైతు సంఘం నాయకుడు
తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ను కూడా అందించాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తులన్నింటికీ కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేం అన్ని విధాలా సహకరిస్తాం అని రాకేష్ టికాయత్ తెలిపారు.

కెసీఆర్ ను తిట్టిన నోటితోనే పొగుడుతున్న రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్
గతంలో హైదరాబాద్ కు వచ్చినప్పుడు కెసిఆర్ పై విమర్శలు గుప్పించిన రాకేశ్ టికాయత్ ప్రస్తుతం, తెలంగాణ సీఎం కెసిఆర్ రైతుల కోసం చేస్తున్న పోరాటానికి తన మద్దతును ప్రకటించి రైతుల కోసం చేసే ఏ ప్రభుత్వ పోరాటానికైనా తాము మద్దతు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ రైతులు సాగుచేస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, దేశమంతా ఒకే విధమైన ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న దీక్ష సహేతుకమైన దీక్ష గా భావించి తాను ఈ దీక్షలో పాల్గొంటున్నట్టు రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. ఏది ఏమైనా గతంలో రైతు ద్రోహి అని అన్న రాకేష్ టికాయత్ ఇప్పుడు కేసీఆర్ తో కలిసి దీక్షలో పాల్గొనడం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications