టీఆర్ఎస్ లో రసమయి వ్యాఖ్యల దుమారం ..తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ అసమ్మతి రాగం!!
టిఆర్ఎస్ పార్టీలో రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. ఇటీవల స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని అసభ్య పదజాలంతో దూషించిన రసమయి బాలకిషన్ ఆడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఎప్పుడూ వివాదాలలో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అధికార పార్టీ ఎమ్మెల్యేగా తన సహజత్వాన్ని కోల్పోయానన్న రసమయి బాలకిషన్
ఓ కంపెనీలో పని చేసేటప్పుడు ఆ కంపెనీ పరిధిలో బ్రతకాలని సింగరేణిలో పని చేస్తూ ఇంకో దగ్గర కూడా చేస్తా అంటే నడవదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు చేశారు. తాను ఓ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా అని సంచలన వ్యాఖ్యలు చేశారు రసమయి. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉండడంతో తన సహజత్వాన్ని కోల్పోయానని రసమయి బాలకిషన్ తెలిపారు.

కలాలు, గళాలు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదం
మహబూబాబాద్లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో పాల్గొన్న రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే అయిన తర్వాత తనకు చాలా మంది దూరమయ్యారని, తెలంగాణ వచ్చాక పాటలు మారిపోయాయని పేర్కొన్నారు. కలాలు , గళాలు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమని కవులు , కళాకారులు సైలెంట్ గా ఉండకూడదని రసమయి బాలకిషన్ వ్యాఖ్యానించారు . ప్రతి గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని రసమయి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ లో దుమారంగా మారాయి
.

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ హోదాలో ఉన్న రసమయి వ్యాఖ్యలపై పార్టీలో చర్చ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్జె కట్టి, ఆడి పాడి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన రసమయి బాలకిషన్ టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి విజయం సాధించారు. మానకొండూరు నియోజకవర్గం నుండి రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రసమయి బాలకిషన్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ హోదాలో ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన పై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న వేళ రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఇది ఒక అసమ్మతి రాగమా ? రసమయి వ్యాఖ్యలపై స్పందన ఏమిటో
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ని పొగుడుతూ పాటలు పాడిన రసమయి వ్యాఖ్యల వెనక ఆంతర్యమేమిటో అన్న చర్చ జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి రసమయి బాలకిషన్ రూపంలో బయట పడిందనే అభిప్రాయాలు పలువురు ప్రతిపక్ష నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా రసమయి వ్యాఖ్యలపై పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి .