మరో ప్రేమోన్మాది ఘాతుకం ... ప్రేమ నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది
తెలంగాణ రాష్ట్రంలో మరో ఘాతుకం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నయిమ్ నగర్ లో కళాశాల కు వెళుతున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ ప్రేమోన్మాది. మొన్నటికి మొన్న మధులిక పై ప్రేమోన్మాది భరత్ చేసిన దాడి ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
హనుమకొండ నయిమ్ నగర్ లో ఉన్న వాగ్దేవి కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రవళి అనే యువతిపై అదే కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న అన్వేష్ అనే యువకుడు దాడి చేసాడు. గత కొంతకాలంగా ప్రేమించమని వెంట పడుతున్న ఆ యువకుడు రవళి ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకుని కళాశాల కు వెళుతున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అకస్మాత్తుగా జరిగిన దాడితో అటు రవళి షాక్ కు గురయ్యింది. అంతలోనే మంటలు చెలరేగటంతో రవళి దాదాపు 80% కాలిపోయింది. కళ్ళెదుటే యువతి క్షణాల్లో మంటలకు బలైపోయింది. నయీం నగర్ నడి రోడ్డు మీద జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరినీ షాక్ కు గురి చేసింది.

అన్వేష్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్తున్నారు. రవళికి ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమోన్మాది అన్వేష్ దాడిలో గాయపడిన రవళి స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా సంగం మండలం లోని రామచంద్ర పురం గ్రామం. దాడి చేసిన అనంతరం అన్వేష్ అక్కడినుండి పరారయ్యాడు.
కళాశాల సమీపంలో జరిగిన ఘటనతో కళాశాల యాజమాన్యం సైతం షాక్ కు గురయ్యింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications