బాబు ద్రోహం, బాగుంటుందని మోడీ చేశారు, మేం చేస్తే తప్పా: కిషన్‌కి హరీష్
హైదరాబాద్: సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు అదే చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు వారితో కలిసి ఉన్న బిజెపి... తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే మాట్లాడలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం మండిపడ్డారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాదయాత్ర పైన హరీష్ రావు మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు ఇలాగే వ్యవహరిస్తే వచ్చేసారి వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. కేవలం ప్రచారం కోసమే వారు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.
నాడు (సమైక్య రాష్ట్రంలో) చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిడిపి - బిజెపి కలిసి ఉన్నాయని, ఇప్పుడు కూడా టిడిపి - బిజెపిలు కలిసి ఉన్నాయని, తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేస్తుంటే వారు మాట్లాడటం లేదన్నారు.

పాలమూరుకు నీళ్లు తెస్తామని మేం చెబుతుంటే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, దానికి కిషన్ రెడ్డి మద్దతిస్తున్నారని ఆరోపించారు. నాడు ద్రోహం చేస్తే మాట్లాడలేదు, నేడు ద్రోహం చేస్తున్నా మాట్లాడటం లేదన్నారు. ఆరు మండలాలను ఆంధ్రలో కలుపుతామంటే ఎందుకు మాట్లాడలేదన్నారు.
పోలవరం ఆర్డినెన్స్ పైన కిషన్ రెడ్డి పెదవి ఎందుకు విప్పలేదని ప్రశ్నించారు. ఎవరు తెలంగాణ పక్షమో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మేం రీడిజైనింగ్ చేస్తామంటే రద్దు చేస్తున్నట్లు కాదని, దీనిని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు.
మోడీ చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా
ప్రధాని మోడీ ప్రణాళిక సంఘం రద్దు చేసి నీతి అయోగ్ తెచ్చాడని, ఇంకా బాగా పని చేస్తుందని నీతి అయోగ్ ప్రధాని తెచ్చారన్నారు. మోడీ ఇంకా చాలా వాటిని రద్దు చేశారన్నారు. మోడీ చేస్తే రీడిజైనింగ్, టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే కాదా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
మోడీ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా అని నిలదీశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం పని చేస్తే తమ ప్రభుత్వం రాష్ట్రం కోసం పని చేస్తోందన్నారు. కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. మేం తప్పుచేస్తే సరిదిద్దుకుంటామన్నారు. కానీ గుడ్డిగా వ్యతిరేకించవద్దన్నారు.












Click it and Unblock the Notifications