ప్రతిచర్య తప్పదు: రేవంత్ సర్కారుకు కేటీఆర్ వార్నింగ్
తమ సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతి చర్య తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర డీజీపీని కేటీఆర్, సీనియర్ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. గురువారం తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని డీజీపీకి తెలిపారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదన్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు కేటీఆర్.

నిన్న ఒక్క రోజే రెండు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధించి ఆధారాలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేశాం. విద్యార్థి నాయకుడు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టాం. 50 మంది కాంగ్రెస్ గుండాలు, తాగిన మత్తులో ఆకస్మికంగా రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారు. మా వాళ్లు తిరగబడి ఉంటే ఆ 50 మంది కాంగ్రెస్ మూకలు ఒక్కరు కూడా మిగిలేవారు కాదు. కానీ, శాంతియుతంగా మేము నిరసన తెలుపాలని భావించాం. అందుకే ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడలేదు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పోలీసులే తమ నిరసన దీక్షకు సంబంధించిన టెంట్ కూల్చేయటం ఆశ్చర్యం కలిగించింది అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు చారాణా రుణమాఫీ కూడా చేయలేదన్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని కేటీఆర్ తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్ గుర్తుంచుకోవాలని.. భవిష్యత్‌లో చర్యకు ప్రతిచర్య ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. నెల రోజుల్లో 28 హత్యలు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నగరానికి ఏమైంది అంటూ సీఎంకు దన్నుగా నిలిచిన పత్రికలే వార్తలు రాస్తున్నాయి. పోలీసు యంత్రాంగం మీద మాకు సానుభూతి ఉంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సీఎం అధికారం చెలాయిస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా మా పార్టీ యువకులను వేధిస్తున్నారు. ఇంకా ఇలాగే కొనసాగితే మా నుంచి ప్రతిఘటన కూడా తప్పదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దనే తాము ఇప్పటి వరకు ఊరుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. మా సహనాన్ని, చేతగాని తనం అనుకోవద్దు. మేము ప్రతిఘటిస్తే అప్పుడు మమ్మల్ని నిందించవద్దు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చండి. పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాష్కీ లాంటి నేతల భవనాలను కూల్చేసి ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయండి అని కేటీఆర్ హితవు పలికారు.












Click it and Unblock the Notifications