అతి తక్కువ ఖర్చుతో రెడీమేడ్ ఇల్లు.. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.. ఓ లుక్కెయ్యండి!!
చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలి అని కలలు కంటూ ఉంటారు. కానీ అందుకు తగిన విధంగా వారి వద్ద ఆర్థిక వనరులు లేక రక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సొంత ఇల్లు కట్టుకోవాలంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని. విపరీతంగా పెరిగిన సిమెంట్, ఐరన్, ఇసుక ధరలతో సామాన్యులు ఇంటిని కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక అటువంటి వారికి ఎక్కడికైనా తీసుకెళ్లగల , రెడీమేడ్ ఇల్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని అతి తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఇక ఇటువంటి రెడీమేడ్ ఇళ్లను పకడ్బందీగా తయారు చేస్తున్న ఎన్నో సంస్థలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.

వరంగల్ నగరంలో రెడీమేడ్ ఇల్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కడైనా పెట్టుకో గలిగిన ఫిక్స్డ్ ఇళ్లు వచ్చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో అటువంటి ఇంటిని హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఇల్లు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వడ్డేపల్లి కి చెందిన బొల్లేపల్లి సుహాసిని, సతీష్ గౌడ్ దంపతులు సుబేదారి వడ్డేపల్లి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సొంత ఫ్లాట్ లో ఇంటి నిర్మాణం చేయాలనుకున్నారు. అయితే ఇంటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో రెడీమేడ్ హౌస్ గురించి తెలుసుకొని, రెడీమేడ్ హౌస్ కొనుగోలు చేసి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

అతి తక్కువ ఖర్చులో సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం
అంతే రెడీమేడ్ హౌస్ లు తయారు చేస్తున్న వారిని సంప్రదించి ఎనిమిది లక్షల 50 వేల రూపాయలతో కిచెన్ సింగిల్ బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, హాల్ తో పూర్తిగా ఐరన్ ఉపయోగించిన మొబైల్ హౌస్ ను కొనుగోలు చేసుకున్నారు. ఇక దీనిని తయారీ కంపెనీ లారీలో తీసుకొచ్చి బిగించి వెళ్లారు. ఈ ఇంటిని ఎక్కడికైనా తరలించి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని, 30 ఏళ్ళకు పైగా పటిష్టంగా ఉంటుందని, సదరు తయారీదారులు గ్యారంటీ ఇచ్చినట్టు సతీష్ గౌడ్ తెలిపారు. ఈ రెడీమేడ్ హౌస్ మొత్తం నాలుగు టన్నుల బరువు ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో రెడీమేడ్ ఇళ్ళ తయారీదారులు .. సొంతింటి కల నేరవేర్చుకోండి
ఇక అతి తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని అనుకునేవారికి ఈ రెడీమేడ్ ఇళ్ళు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అటువంటి రెడీమేడ్ ఇళ్ల తయారీ సంస్థలు అనేకం పనిచేస్తున్నాయి. వారు తయారు చేసిన మోడల్స్ మాత్రమే కాకుండా, మనకు అనుకూలంగా ఉండే లాగా మోడల్ తయారు చేయించుకునే వీలు కూడా ఉంటుంది. మరి ఇంకెందుకాలస్యం అతి తక్కువ ఖర్చుతో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగిన మూవబుల్ ఇళ్ళను కొనుగోలు చేసి మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. ఓ ఇంటివారు అయిపోండి.












Click it and Unblock the Notifications