రాత్రికి రాత్రే మార్పు: ఉత్తమ్ కనిపించడంలేదు.. పిఎస్‌లో ఫిర్యాదు, రాజాసింగ్ దూరం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు రెబల్స్ షాకిస్తున్నారు. అధికార టిఆర్ఎస్, విపక్ష టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీల రెబల్స్... తాము ఎట్టి పరిస్థితుల్లో బరిలో నిలుస్తామని చెబుతున్నారు. అయితే, ముఖ్య నేతల చొరవతో తెరాసలో కొంత రెబల్స్ బెడద తగ్గింది.
గురువారం నాడు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు ఎవరో తేలింది. అయితే, పార్టీలు కొన్నిచోట్ల హఠాత్తుగా అభ్యర్థులను మార్చాయి.
All Stories About Rohit Suicide ; కార్టూన్
దీంతో అప్పటికే నామినేషన్ వేసిన ఆశావహులు.. పార్టీ తరఫున బీఫాం వస్తుందని భావించారు. తీరా తమకు బీఫాం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

రెబల్స్‌ను బుజ్జగించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది రెబల్స్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చివరి నిమిషంలో తమ పేరును తీసేశారని కొందరు, రాత్రికి రాత్రి బిఫాంలో పేర్లు మార్చేశారని ఇంకొందరు, తనకు టిక్కెట్ ఇస్తానని మరొకరికి ఇచ్చారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఉత్తమ్ కనిపించలేదని ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్వతి అనే నాయకురాలు తమ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించడం లేదని మొగల్ పురా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను బీఫాం కోసం ఉత్తమ్‌ను కలిసేందుకు వెళ్లానని ఆయన కనిపించలేదని, ఆయన చుట్టూ తిరిగినా కనిపించలేదని, అందుకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు.
మాదాపూర్ టిక్కెట్ ఆశించిన బిజెపి ఆశావహులు ఒకరు పార్టీ కార్యాలయం వద్ద సీనియర్ల పైన మండిపడ్డారు. మాదాపూర్ టిక్కెట్ పార్టీకి సంబంధం లేని వారికి ఇచ్చారని ఆరోపించారు. తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కారు పైన మరో వర్గం దాడికి పాల్పడింది.
తాము 92 మందికి బీఫారాలు ఇచ్చామని, వారే తమ పార్టీ అభ్యర్థులు అని తెలంగాణ టిడిపి చీఫ్ ఎల్ రమణ అన్నారు. అధికారులకు జాబితాను సమర్పించారు. కాగా, చివరి నిమిషంలో బిజెపి, టిడిపి అభ్యర్థుల లెక్క మారింది.
టిడిపికి కేటాయించిన అయిదు స్థానాల్లో బిజెపి, బిజెపికి కేటాయించిన అయిదు స్థానాల్లో టిడిపి పోటీ చేయనుంది. బిఫారాలను టిడిపి - బిజెపి అభ్యర్థులు పోటాపోటీగా ఇచ్చారు.
అడిక్‌మెట్, అమీర్ పేట, సుభాష్ నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో టిడిపి అభ్యర్థులు, హబ్సిగూడ, రెహ్మత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, పటాన్ చెరు, జీడిమెట్లలో బిజెపి అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గం పేరుతో బిజెపికి ధీటుగా టిడిపి బీఫారాలు ఇచ్చి పోటీ చేయిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
రాజాసింగ్ ఆగ్రహం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థులను ఎంపిక చేయలేదని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ మండిపడ్డారు. తాను ఇచ్చిన జాబితాలో ఒక్కరికీ టిక్కెట్ ఇవ్వలేదన్నారు. అనర్హులకు టిక్కెట్ ఇచ్చారని ధఅవజమెత్తారు. తాను బిజెపికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉండనని చెప్పారు. తన వర్గం వారికి ప్రచారం చేసే పరిస్థితి లేదని, అదొక్కటే తనకు బాధాకరమన్నారు.
తనకు తెలియకుండా కొందరికి బీఫాం ఇచ్చారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు మీసాల చంద్రయ్య తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని చెప్పినా వినలేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications