పెళ్లికొడుక్కి వరద కష్టం.. ఏం చేశారో తెలుసా.. వైరల్ వీడియో!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేకచోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.
వరుడికి వరద కష్టాలు
అయితే ఇదే సమయంలో పెళ్లి ముహూర్తం పెట్టుకున్న ఓ వరుడికి వరద కష్టాలు వచ్చిపడ్డాయి. కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాపం పెళ్ళికొడుకుకు ఎన్ని కష్టాలు వచ్చాయి అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరం ఊర చెరువు మత్తడి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

పెళ్ళికొడుకు వాగు ఎలా దాటాలో అర్థంకాని పరిస్థితి
దీంతో మండల కేంద్రంలో పెళ్లి చేసుకోవడానికి వెళుతున్న పెళ్ళికొడుకు వాగు ఎలా దాటాలో అర్థంకాని పరిస్థితి వచ్చింది. వాగు కారణంగా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పెళ్ళికొడుకు వాగు దాటడానికి కష్టపడాల్సి వచ్చింది. నాలుగు గంటల పాటు వరద ఉధృతి తగ్గి వాహనాలు వెళతాయేమోనని పెళ్ళికొడుకు బంధువులు ఆశగా ఎదురు చూశారు.
పెళ్ళికొడుకుని భుజాల మీద ఎత్తుకొని వాగు దాటిన బంధువులు
కానీ వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న క్రమంలో, ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది అని భావించి పెళ్ళికొడుకుని భుజాల మీద ఎత్తుకొని బంధువులు వాగు దాటారు.ఇక అవతల ఒడ్డుకు చేర్చిన తర్వాత మరో వాహనం మాట్లాడుకుని పెళ్లి మండపానికి తీసుకువెళ్లారు. గన్నేరువరం ఊర చెరువు లో లెవెల్ కన్వర్ట్ సమస్యతో ప్రతి సంవత్సరం గన్నేరువరం మండలంలోని ప్రజలు ఇదేవిధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పెళ్ళికొడుకు వరద కష్టాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
దీనిపైన బ్రిడ్జి నిర్మిస్తే బాగుంటుందని చాలాకాలంగా ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పెళ్లి చేసుకోవడానికి వెళ్లే పెళ్ళికొడుకు పరిస్థితి చూసిన తర్వాత దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు త్వరితంగా స్పందిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం పెళ్ళికొడుకుని వాగు దాటించడానికి బంధువులు ఎత్తుకొని వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన వారంతా పెళ్ళికి ముందే పాపం ఎన్ని కష్టాలు అంటే పెళ్ళికొడుకు పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications