రేవంత్ రెడ్డిని ఐదేళ్ళు సీఎంగా ఉండనివ్వరా? మధ్యలో జరిగేది అదేనా!!
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పట్టం కడుతుంది. రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు. ఈ సమయంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగుతారా? లేదా మధ్యలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని పక్కకు జరిపి, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.
ఈ చర్చ వెనుక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలు ప్రధాన కారణంగా తెలుస్తుంది. తాజాగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరు నెలలో, ఏడాదో, రెండేళ్లలోనో సీఎంగా కేసీఆర్ మళ్ళీ అధికారం చేపడతారని వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ అధికారం చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల వెనుక అదే అర్థం అందరికీ స్ఫురిస్తుంది. ఇంకోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఫామ్ హౌస్ కి వెళ్లిపోవడం, కేటీఆర్ ఒక మూడు నెలల కాలం కాంగ్రెస్ పార్టీ కుదురుకొని పాలన పగ్గాలు సాగించటానికి అవకాశం ఇస్తామని, ఆపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, కాంగ్రెస్ లోని అసంతృప్తులకు గాలం వేసి తమ వైపుకు తెచ్చుకొని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా ప్రజలకు చూపించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిని పూర్తి కాలం సీఎం గా పని చేయనివ్వరా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే కుప్పకూలుతుందా? అన్న చర్చ జరుగుతుంది. ఈ అనుమానం తెలంగాణా రాష్ట్ర ప్రజల్లోనూ వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications