రేవంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్: టిఆర్ఎస్సే ఉండదని పోలీసులకు హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం అసెంబ్లీకి వచ్చారు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఇటీవలి వరకు కొడంగల్‌కే పరిమితమైన రేవంత్ రెడ్డి... కోర్టు షరతులు సడలించింది.
మొన్నటిదాకా బెయిల్ ఆంక్షలతో తన సొంత నియోజకవర్గం కొడంగల్ కే పరిమితమైన ఆయన హైకోర్టు ఆంక్షలు సడలించిన నేపథ్యంలో హైదరాబాదులో కొద్ది రోజుల క్రితం అడుగుపెట్టారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో, రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
సమావేశాలు ప్రారంభం కావడానికి కాస్తంత ముందుగానే అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. గతంలోలాగే ఆయన రెచ్చిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా నిప్పులు చెరిగారు.

ఈ సందర్భంగా ఆయన పోలీసుల వైఖరి పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కారు శాశ్వతం కాదని, పోలీసులు వారి విధులు వారు నిర్వహిస్తే మంచిదని హెచ్చరించారు. కాగా, సభకు టిడిపి తరఫున రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.
కాగా, శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కొంత గందరగోళం చెలరేగింది. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యల పైనే చర్చించాలని ఎందుకు పట్టుబడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలేనా? అంటూ ప్రశ్నించారు. రైతు సమస్యలపై చర్చిద్దామని బీఏసీలో నిర్ణయించామని అందువల్ల, సమయం వృథా కాకుండా సమస్యలపై చర్చ జరుపుదామన్నారు. విపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలను ఇస్తే స్వీకరిస్తామన్నారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... రైతులకు ఈ గతి పట్టడానికి మీరే కారణం అంటూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. మీ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే, ఆత్మహత్యల పేరుతో సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ... అధికార పక్షం వైఖరేంటో పూర్తిగా అర్థమవుతోందని మండిపడ్డారు. చర్చ ప్రారంభం కాకుండానే రైతుల పరిస్థితికి మీ పరిపాలనే కారణమని ఆరోపిస్తున్నారని, ఈ రకమైన వ్యూహంతో విపక్షాలను కట్టడి చేయాలని చూడటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications