పోలీసులపై జడ్జికి రేవంత్ ఫిర్యాదు, కేసీఆర్ ఏరవేసి...
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం పోలీసులు తన పట్ల ప్రవర్తించిన తీరు పైన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆయనను ఆదివారం సాయంత్రం ఏసీబీ అరెస్టు చేసింది.
సోమవారం ఉదయం న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల పైన జడ్జికి ఫిర్యాదు చేశారు. పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి దెబ్బ తగిలిందని, తనకు ట్రీట్మెంట్ కావాలని కోరారు. రేవంత్ కోసం బెయిల్ పిటిషన్ వేస్తామని ఆయన లాయర్లు చెప్పారు.
బెయిల్ పిటిషన్ దాఖలు, కస్టడీ కోరిన ఏసీబీ
రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోరింది.
ఆందోళనలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారని పార్టీ నగర సెక్రటరీ జనరల్ ఎమ్మెన్ శ్రీనివాస రావు అన్నారు. రేవంత్ అరెస్టును నిరసిస్తూ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సోమవారం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.
ఎర వేసి రేవంత్ రెడ్డిని కేసులో ఇరికించారని, ఇది ముమ్మాటికి అధికారపక్షం కుట్ర అని, ఇలాంటి చర్యలకు పాల్పడడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి ముడారి పురుషోత్తం అన్నారు.
అక్రమంగా బనాయించిన కేసు అని, అసెంబ్లీలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సస్పెండ్ చేసిన సర్కారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డిని కుట్ర కేసులో ఇరికించిందని, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నీచానికి దిగజారడం ఏవిధంగా నైతికత అని కృష్ణాయాదవ్ ప్రశ్నించారు.
నీతి, నిజాయితీ, అవినీతి రహిత పాలన అనే వారు అక్రమ కేసులకు ఏం సమాధానం చెబుతారన్నారు. రేవంత్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రలోభపెట్టి ఓ మ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారని, ఇలాంటి వాటికి టీడీపీ భయపడదన్నారు. రేవంత్‌రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని, ఫోన్ ట్యాప్ చేయడం అంత సులువు కాదన్నారు.












Click it and Unblock the Notifications