తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ-సింగపూర్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు..!
తెలంగాణలో పెట్టుబడులు,పట్టణాభివృద్ధి ప్రణాళికలపై సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా చర్చించారు.అసెంబ్లీలో జరిగిన ఈ భేటీలో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొంది.
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు అవకాశాలపై సింగపూర్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతులు,విధాన సహకారం,భూసేకరణ,అనుమతుల ప్రక్రియ వంటి అంశాల్లో ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.

మూసీ పునరుజ్జీవనం,ఫ్యూచర్ సిటీపై ప్రజెంటేషన్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును సీఎం సింగపూర్ బృందానికి వివరించారు.తొలి దశలో మూసా,ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు నైట్ ఎకానమీకి కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.
హైదరాబాద్‌ను కేవలం పర్యాటక కేంద్రంగా కాకుండా నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు.హార్వర్డ్,ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలు,MIT,లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధులకు వివరించినట్లు సమాచారం.
నెట్ జీరో సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ
భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు.పరిశ్రమలు,విద్య,పరిశోధన,పట్టణ జీవన ప్రమాణాలు ఒకే వేదికపై కలిసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు వివరించారు.ఇలాంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులకు అంతర్జాతీయ భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించాలని సింగపూర్ ప్రతినిధులను సీఎం కోరారు.పెట్టుబడుల అంశంపై ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వం తెలిపింది.డిసెంబరులో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సింగపూర్ బృందాన్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు,దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ Dr.ఫ్రాన్సిస్ చోంగ్,కాన్సుల్ జనరల్ విలియం చిక్,ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.సెమీ కండక్టర్లు, పట్టణాభివృద్ధి,గ్రీన్ సిటీ ప్రణాళికలపై జరిగిన ఈ చర్చలు రాష్ట్ర పెట్టుబడి వ్యూహంలో కీలకంగా మారే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
