నేను ఉన్నంతవరకు వాళ్లకు కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు: సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంతవరకూ కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబాన్ని రానివ్వనని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబమే పెద్ద శత్రువు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. దీంతో ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శత్రువని విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఉన్నంతవరకూ కాంగ్రెస్ లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని తెలిపారు. కవిత చేసిందంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామాను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకిగా మారుతున్నారని మండి పడ్డారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

" నేను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఉండదు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణ రాష్ట్రానికి శత్రువులు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకు కేసీఆర్ కు కవిత లేఖ అంటూ హడావుడి చేశారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకిగా మారారు. కిషన్ రెడ్ది, కేసీఆర్ ఒకటే" అని దిల్లీలో జరిగిన మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై దిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపైనా ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనను జనంలోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో రెండు బహిరంగసభలు నిర్వహించాలని సీఎం రేవంత్ అధిష్ఠానానికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ సభలకు రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications