రాజీనామాలతో నిధులొస్తే నలుగురు బీజేపీ ఎంపీలతో రాజీనామా చేయించండి: మునుగోడులో రేవంత్ రెడ్డి సవాల్
టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. నారాయణ పూర్ మండలం పొర్లు గడ్డ తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించింది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని భావించామని కానీ ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపించలేదని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తెలంగాణ సమాజం మొత్తం మునుగోడు ఉప ఎన్నిక వైపే చూస్తోందని టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాజీనామాలు చేస్తే నిధులొస్తే బీజేపీ ఎంపీలు రాజీనామా చెయ్యాలి
ఇక ఇదే సమయంలో రాజీనామాలు చేస్తేనే నిధులు వస్తాయని, అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు బిజెపిలోని నలుగురు ఎంపీలను రాజీనామా చేయించి విధులు తీసుకురావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామాతో ఇప్పటివరకు ఎన్ని గ్రామాలకు నిధులు వచ్చాయో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కమ్యూనిస్టులు టీఆర్ఎస్ కు అమ్ముడుపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు అమ్ముడు పోవడంతో ఇంత కాలం వారు చేసిన పోరాటాలు వృధా అయిపోయాయి అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

పార్టీ ఫిరాయించిన అందరు నేతలతో రాజీనామాలు చేయించలేదు ఎందుకు ?
ఎంపీటీసీ లను, జెడ్పీటీసీ లను, సర్పంచులను, ఎంపీపీలను కూడా బిజెపిలో చేర్చుకున్నారని, మరి వారి చేత ఎందుకు రాజీనామాలు చేయించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలా చేస్తే ఆ గ్రామాలకు కూడా నిధులు వస్తాయి కదా అని రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను టార్గెట్ చేశారు. పైసల కోసం అమ్ముడుపోయి, ఆపై సిద్ధాంతాలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు తోడుదొంగలుగా మారి ప్రజలను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక బీజేపీలో పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పండుగ అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి బిజెపిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఎల్కే.అద్వానీ, వెంకయ్యనాయుడును చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం బ్రతకాలంటే మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించాలి
పార్టీ మారి బీజేపీ లోకి వెళ్లిన చాలామంది సీనియర్ నేతలకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వెంకట్ రెడ్డి తప్పనిసరిగా పాల్గొంటారు అంటూ వ్యాఖ్యలు చేశారు. బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్యం బ్రతకాలంటే మునుగోడు లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటాం
డిండి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల మునుగోడుకు తీవ్ర అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే మునుగోడుకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తే ఆయనకు మునుగోడు టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ తరపున రాజగోపాల్ రెడ్డి బి ఫామ్ ఇవ్వడంతోపాటు సీనియర్ నేతలు కలిసి ఆయనను మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications