సింగం వస్తోందని కెసిఆర్ చైనా పరార్, అంతుచూస్తా: రేవంత్ ఆవేశం, వెన్నుపోటు భయం
హైదరాబాద్: ఖాళీ అయ్యేందుకు తమ పార్టీ మందు సీసా కాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన చాలా రోజుల తర్వాత హైదరాబాదులో అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ప్రభుత్వం పైన పోరాటం ఆపేది లేదని చెప్పారు. ప్రజా సమస్యల పైన ప్రభుత్వం అంతు చూస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తనకు ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ తనతో పాటు చైనా పర్యటనకు సభాపతిని తీసుకు వెళ్లారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించే అధికారం జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్‌కు ఎవరిచ్చారని నిలదీశారు.
బుధవారం ఆయన కొడంగల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఎల్బీ నగర్లో ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయన సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు సైకిల్ ఎక్కారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు.

తెలంగాణలో ఆట మొదలైందని కేసీఆర్ అన్నారని, ప్రారంభమైనది ఆట కాదని, వేట మొదలైందన్నారు. బంగారు తెలంగాణను తీసుకువస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారన్నారు.
కేసీఆర్‌కు మందులో సోడా పోసే మంత్రి తరహా నేతను తాను కాదన్నారు. త్వరలో కేసీఆర్ అంతు చూస్తానన్నారు. కేసీఆర్‌కు ఫాంహౌస్ పైన ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది టీడీపీయే అన్నారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకంటూ చైనా వెళ్లిన కేసీఆర్‌కు, ఆర్థిక శాఖ మంత్రిని వెంటబెట్టుకుని వెళ్లాలన్న జ్ఞానం లేదా? అని ఆయన ప్రశ్నించారు. తనకు తాబేదార్లుగా పని చేసే వారినే కేసీఆర్ చైనాకు తన వెంట తీసుకెళ్లారని విమర్శలు గుప్పించారు.
సింగం సింగిల్‌గా వస్తోందని..
సింగం సింగిల్‌గా హైదరాబాద్ వస్తుందని తెలిసి.. కెసిఆర్ పిరికిపందలా ప్రత్యేక విమానం వేసుకొని చైనాకు పారిపోయాడన్నారు. మా అడ్డా ఇక్కడనే అని, ఇక్కడే ఉంటామన్నారు. కెసిఆర్ దొర కాదని, అరాచకవాది అన్నారు. ఆయన రాక్షసానందం పొందే వ్యక్తి అన్నారు.
విద్యార్థులను మరిచాడు
ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని బలిదానం చేసుకున్నారని, వాళ్ల త్యాగాన్ని కెసిఆర్ మరిచారన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతులపై పడ్డాడన్నారు. అప్పుల బాధతో రైతులు కాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఎఖరాల ఫాం హౌస్ పైన వందసార్లు సమీక్ష చేస్తున్న కెసిఆర్ రైతుల ఆత్మహత్యలపై ఆలోచించడం లేదన్నారు.












Click it and Unblock the Notifications