కామారెడ్డిలో రేవంత్ నామినేషన్: సిద్ధరామయ్య వెంటరాగా
కామారెడ్డి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత, మిజోరంలల్లో పోలింగ్ ముగిసింది.

తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేయడానికి నేడే చివరి గడువు. ఈ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. 13వ తేదీన వాటి స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ పేపర్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 15.
ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. నామినేషన్‌ను దాఖలు చేశారు. పలువురు సీనియర్ నేతలూ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ వేయనున్నారు.
రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న విషయం తెలిసిందే. తన కంచుకోట కొడంగల్‌తో పాటు కామరెడ్డిలో పోటీలో ఉన్నారు. కేసీఆర్‌పై పోటీకి దిగారు. మూడు రోజుల కిందటే కొడంగల్‌లో నామినేషన్ వేశారాయన. నామినేషన్ పక్రియ ముగిసిన అనంతరం కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు రేవంత్ రెడ్డి.
ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నారు. సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సిద్ధరామయ్య హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications