రేవంత్ ప్రమాణస్వీకారం సమయం మార్పు-అదే వేదికపై కాంగ్రెస్ కృతజ్ఞతా సభ..!
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే చివరి నిమిషంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రేపు ఉదయం 10.28 నిమిషాలకు ముహుర్తం నిర్ణయించగా.. అది కాస్తా మారిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న కృతజ్ఞతా సభ కూడా దీనితో పాటు వచ్చి షెడ్యూల్ లో చేరిపోయినట్లు తెలుస్తోంది.

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత సీఎల్పీ నేతగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఈ నెల 7న తేదీన ముహుర్తం సిద్దం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీతో పాటు అధికార మిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఓ భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. సోనియాగాంధీ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9న ఈ సభ నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఈ షెడ్యూల్ అంతా చివరి నిమిషంలో మారిపోయింది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు తాజాగా ముహుర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ఇతర నేతలు హాజరవుతున్నారు. గవర్నర్ తమిళిసై వీరి సమక్షంలో రేవంత్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆమెకు వీడ్కోలు పలకనున్నారు.
గవర్నర్ వెళ్లిపోయాక ఎల్బీ స్డేడియంలోనే కాంగ్రెస్ కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో మధ్యాహ్నం రేవంత్ ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞతా సభను అక్కడే కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మిత్రపక్షాల ముఖ్యమంత్రులతో పాటు ఇండియా కూటమిలోని పార్టీల నేతల్ని కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications