'తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర'.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..??
దట్టమైన నల్లమల అడవి.. ఎటు చూసినా కొండలు, కోనలు.. జలపాతాలు.. పక్షుల రాగాలు.. జంతువుల శబ్దాలు.. పచ్చని ప్రకృతి నడుమ వీటన్నింటినీ దాటుకుంటూ సాగే జర్నీ.. ఊహించుకుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదూ.. అదే తెలంగాణ 'అమర్‌నాథ్' యాత్ర.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేసి సలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నిజంగా శివుడి ఆశీస్సులు పొందిన ఫీలింగ్ కలుగుతుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే ఈ సలేశ్వరంలోని శివాలయానికి భక్తులు లక్షలాదిమంది పోటెత్తుతారు.
తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. రాష్ట్రంలో అనేక జాతరలు, పండగలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక రాష్ట్రంలో 'సలేశ్వరం జాతర'కు ఎంతో పేరుంది. తెలంగాణ 'అమర్‌నాథ్' యాత్రగా పిలుచుకునే ఈ జాతరకు ఏటా లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కాలినడకన నల్లమల అడవిలో ప్రయాణించి కొండల్లో కోనల్లో దాగిన ఆ శివయ్య చెంతకు చేరుకుని పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 2 నుండి 6 వరకు సలేశ్వరం జాతర జరగనుంది. దట్టమైన నల్లమల అడవుల్లో.. ప్రకృతి ఒడిలో సాగే అద్భుత సాహస యాత్రగా పిలుస్తుంటారు.
ఇక సలేశ్వరం నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలంలోని నల్లమల అభయారణ్యంలో ఉంది. ఏటా ఉగాది పండగ తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి సందర్భంగా ఒక్కసారి మాత్రమే ఈ అటవీ మార్గాన్ని భక్తుల కోసం తెరుస్తారు. ఇక నల్లమల అడవిలో దాగిన ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం వెళ్లే బస్సు ఎక్కి మన్ననూర్ వద్ద దిగాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో సలేశ్వరం బేస్ క్యాంప్(రాంపూర్ పెంట) వరకు ప్రయాణించవచ్చు.

ఇక్కడి నుంచి సలేశ్వరం యాత్ర స్టార్ట్ అవుతుంది. దాదాపు 5 కిలోమీటర్ల పాటు దట్టమైన అడవిలోని కొండలు, లోయలు దాటుకుంటూ కాలినడకన ఆలయానికి చేరుకోవాలి. ఇక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అడవిలోకి అనుమతి ఉంటుంది. రాత్రిళ్లు జర్నీ చేసేందుకు భక్తులకు అనుమతి లేదు. ప్రయాణం మొత్తం దట్టమైన అడవిలో ఉంటుంది కాబట్టి ఆహారం ఎక్కువగా లభించదు. అందువల్ల భక్తులు తమవెంట వాటర్, డ్రై ఫ్రూట్స్ లాంటి తీసుకెళ్లడం ఉత్తమం. అలాగే కాలినడకన ప్రయాణం కాబట్టి శరీరానికి వదులుగా ఉండే దుస్తులు ధరించడం.. గ్రిప్ ఉన్న షూస్ ధరించడం ఉత్తమం.












Click it and Unblock the Notifications