ఆవేదన భరించలేకపోతున్నా.. సాలూరు మున్సిపల్ చైర్మన్ జనసేనకు కేటాయింపుపై మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో పురపాలక ఎన్నికల సీట్ల కేటాయింపు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. సుదీర్ఘ కాలం తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ అందించిన ఈ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవిని కూటమి సర్దుబాటులో జనసేనకు కేటాయించడంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు కలత చెందుతున్నారు. ఈ విషయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి భావోద్వేగానికి గురయ్యారు.
సాలూరులో నిర్వహించిన సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఆవేదన భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. పార్టీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అధిష్ఠానం పునరాలోచన చేసేలా కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడిని కోరారు. ఎస్టీ ఎమ్మెల్యేను గెలిపించేందుకు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న ఇక్కడి టీడీపీ నేతలు, బీసీలకు అన్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు.

పట్టణంలో జనసేనకు పెద్దగా ప్రాబల్యం లేదని, తమకు అన్యాయం జరిగినట్లు భావిస్తున్నామని స్థానిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి బీసీ మహిళ అయిన గుల్లా మంజీరను రాత్రికి రాత్రే వివాహం చేసుకున్నారు. పదవి ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
అయితే కూటమి సీట్ల సర్దుబాటులో సీటు జనసేనకు వెళ్లడంతో ఆయన ఆశలు నిరాశగా మారాయి. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. సుమారు 50 వేల మంది జనాభా ఉంది. గతంలో అభివృద్ధి పనులు ఆగిపోయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో అనేక పనులు ప్రారంభమయ్యాయి.
రోడ్లు, లైటింగ్, పబ్లిక్ టాయిలెట్లు, నీటి సరఫరా పథకాలకు శంకుస్థాపనలు జరిగాయి. మున్సిపాలిటీని మోడల్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయినా స్థానికంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పలు వర్గాలు తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి.
టీడీపీ శ్రేణులు సీటు తమకే రావాలని అధిష్ఠానానికి విన్నవిస్తున్నాయి. జనసేన వైపు నుంచి కూడా అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. సాలూరు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. గిరిజన, బీసీ సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి సంధ్యారాణి తమ ఆవేదనను అధిష్ఠానానికి చేరవేస్తామని హామీ ఇచ్చారు. కూటమి భాగస్వామ్యంలో సమన్వయం కావాలని, స్థానిక కార్యకర్తల కష్టాలను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ వివాదం స్థానిక రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.












Click it and Unblock the Notifications
