విషాదం.. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు!
గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నోయిడాలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రబుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో తల్లిదండ్రులతో పాటు వారి ముగ్గురి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ఒకేసారి మరణించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు, తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫుడ్ పాయిజనింగ్ లేదా ఏదైనా విషపదార్థం శరీరంలోకి అధిక మోతాదులో వెళ్లడం వల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన ఐదుగురు చివరిగా టీ తాగి, మ్యాగీ తిన్నట్లు తెలిసింది. అయితే కేవలం వారు తిన్న ఆహారం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా లేదా దీని వెనుక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వాతే ఈ మరణాలకు గల అసలు కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వారికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
