బస్ స్టాండ్స్ లో ప్రయాణికుల దసరా కష్టాలు మామూలుగా లేదు.. తాజా పరిస్థితి ఇలా!
దసరా పండుగ సెలవులు మొదలవడంతో హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టికెట్ కౌంటర్ల వద్ద, ప్లాట్ఫామ్ల్లో, వెయిటింగ్ హాళ్లలో రష్ ఎక్కువగా ఉంది. ఇవాళ, రేపు మరింత రద్దీ పెరుగుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.
పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సాధారణ సర్వీసులతో పాటు అదనపు బస్సులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర శివారు ప్రాంతాలైన ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. స్పెషల్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు.

అయితే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్లు దొరకడం కష్టంగా మారింది. కొన్ని రూట్లలో టికెట్లు ముందుగానే అయిపోయాయి. బస్సులు సమయానికి రాకపోవడం, ప్లాట్ఫామ్ల్లో గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్లో త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు సరిపోవడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు ఈ రద్దీని అవకాశంగా మార్చుకుని ఛార్జీలు భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.600-700 ఉండే విజయవాడ రూట్లో ఏసీ స్లీపర్ టికెట్ రూ.1,400-1,700 వరకు అయ్యింది. విశాఖపట్నం, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ వంటి రూట్లలో కూడా రెట్టింపు, మూడింతలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టికెట్ బుకింగ్ ఏజెంట్లు కూడా ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేకపోతున్నారు.
చాలా మంది ప్రయాణికులు తప్పనిసరై అధిక ఛార్జీలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులపై కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. మియాపూర్ నుంచి బాలానగర్ వై జంక్షన్ వరకు వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. ఆర్టీసీ అధికారులు అదనపు సిబ్బంది, వాలంటీర్లను నియమించి రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పూర్తిగా సమస్యలు తగ్గడం లేదు.
దసరా సెలవులు ముగిసే సమయంలో తిరుగు ప్రయాణాల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఆర్టీసీ సూచిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలపై ఫిర్యాదులు చేసే వీలు ఉందని అధికారులు చెబుతున్నారు. పండుగ సంతోషంతో సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలు ఈ రద్దీ, ఇబ్బందులను ఓర్చుకుని ప్రయాణం సాగిస్తున్నారు.













Click it and Unblock the Notifications
