ఏపీ మీదుగా బెంగళూరు, ముంబాయికి వందేభారత్ స్లీపర్ - హాల్ట్స్, టైమింగ్స్..!!
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులకు రెండో వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. కొంత కాలంగా చర్చల్లో ఉన్న ముంబాయి- బెంగళూరు వందేభారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ ప్రతిష్టాత్మక రైలు ఏపీ మీదుగా రాకపోకలు సాగించనుండటంతో రాయలసీమ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ రైలు ఆగే స్టేషన్లతో పాటుగా రైలు ప్రయాణ వేళలను అధికారులు వెల్లడించారు.
ముంబై-బెంగళూరు మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల ప్రయాణానికి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రాకతో 16 గంటలకు సమయం తగ్గనుంది. అదే విధంగా ప్రస్తుతం ముంబాయి నుంచి ప్రధాన రైళ్లు బెంగళూరు కు కొనసాగుతున్న మార్గంలోనే ఈ రైలు నడవనుంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగనుంది. ఏపీలోని ధర్మవరం, అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజ్ కల్పించారు. అదే విధంగా ఈ రైలు రాయచూర్, వాడి, కలబురిగి, సోలాపూర్, పూణె, కళ్యాన్ స్టేషన్లలో ఆగనుంది.దీనివల్ల ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు బెంగళూరు, ముంబై నగరాలకు వేగంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రతిపాదిత వేళల ప్రకారం బెంగళూరులో రాత్రి 7.50 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముంబై చేరుకుంటుందని వివరించారు.

ఏపీ మీదుగా రాకపోకలు...షెడ్యూల్
ఈ నెలాఖరులో ఈ ముంబాయి- బెంగళూరు వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా.. మరో వైపు కొత్తగా ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, అమృత్ భారత్ ఏసీ కోచ్ లను ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైలును విశాఖ నుంచి తిరుపతి, లేదా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వందేభారత్ స్లీపర్ తో పాటుగా అమృత్ భారత్ రైలు పైన ప్రకటన రానుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఎలాంటి రాయితీలు ఉండవు. ఎవరైనా పూర్తి ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో కిలోమీటర్కు రూ.2.40 నుంచి రూ.3.80 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. వీటిల్లో మొత్తం 16 కోచ్లు ఉంటుండగా.. 823 మంది ప్రయాణికుల వెళ్లే సామర్థ్యం ఉండనుంది.













Click it and Unblock the Notifications
