ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య.. రిటర్న్ తీసుకొస్తూ గొంతుకోసి చంపిన భర్త!
వివాహేతర సంబంధాలు సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు, భార్యలను భర్తలు హతమారుస్తున్న అనేక ఘటనలు ఇప్పుడు సమాజాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలో చోటుచేసుకున్న ఘోర ఘటన కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధం కారణంగా భార్యను భర్త హత్య చేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య, భర్త ఫిర్యాదు
వివరాల ప్రకారం, తన భార్య ప్రియుడితో వెళ్ళిపోగా, తిరిగి తీసుకొస్తూ భార్య ప్రాణం తీసిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. మార్చి 30న భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె జడ్చర్లలో తన ప్రియుడితో ఉన్నట్లు గుర్తించారు.

పోలీసుల సాయంతో భార్యను తిరిగి తీసుకొచ్చే క్రమంలో భర్త ఘాతుకం
అనంతరం పోలీసులు భర్తను వెంట తీసుకుని అక్కడికి వెళ్లి మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆమెను భర్తతో కలిసి తిరిగి తీసుకువస్తుండగా, మార్గమధ్యలో సదాశివపేట మండలం నందికంది వద్ద భర్త ఊహించని ఘాతుకానికి పాల్పడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో భార్య వివాహేతర సంబంధంపై కోపంతో ఉన్న భర్త ఆవేశానికి లోనై ఆమెపై దాడి చేశాడు.
భార్య మృతి .. భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
తీవ్ర ఆగ్రహంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఒక్కసారిగా అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.
హత్యా కారణాలు, ఘటనకు దారి తీసిన పరిస్థితులపై పోలీసుల దర్యాప్తు
హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ దారుణ ఘటనకు పోలీసులు సైతం ఖంగు తిన్నారు. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications