కోకాపేట భూములు హెచ్ఎండిఏవే: అసలు వివాదమేమిటీ?
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని కోకాపేట గ్రామ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అత్యంత విలువైన 1,635 ఎకరాల భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో హెచ్ఎండిఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
కోకాపేట భూములు కేసు విషయమై 15 ఏళ్ళుగా అనేక మలుపులు తిరిగింది. కోకాపేటలో భూములను హెచ్ఎండిఎ కొనుగోలు చేసింది. అయితే ఈ భూములపై న్యాయపరమైన వివాదాలు రావడంతో ... ఈ భూములను కొనుగోలు చేసిన వ్యక్తులు తమకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు.
కోకాపేట భూముల కేసులో ఎట్టకేలకు హెచ్ఎండిఎకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో హెచ్ఎండిఏ అధికారులు సంబరాలు జరుపుకొన్నారు. ఇప్పటికే వేలం పాటలో భూములను కొనుగోలు చేసిన వ్యక్తులు ఊపిరి పీల్చుకొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో హెచ్ఎండిఎ మిగిలిన భూమిని కూడ విక్రయించేందుకు సన్నాహలు చేసే అవకాశాలు లేకపోలేదు.

కోకాపేట భూముల వ్యవహరం 15 ఏళ్ళ మలుపులు
కోకాపేట భూములకు సంబంధించిన వ్యవహరం అనేక మలుపులు తిరిగింది. 15 ఏళ్ళ పాటు హెచ్ఎండిఎ భూముల కేసు కొనసాగింది. కోకాపేట గ్రామం మొత్తం భూమి తమదేనంటూ కేఎ సబీ ఆలీ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. 15 ఏళ్లు అనేక మలుపులు తిరిగి చివరకు ప్రభుత్వమే నెగ్గింది. ఇప్పటికే కొంత భూమిని హెచ్‌ఎండీఏ వేలం వేసింది. టైటిల్‌పై వివాదం రావడంతో ఆ ఒప్పందాలన్నీ చిక్కుల్లోపడ్డాయి. వేలంలో భూములు కొనుగోలు చేసిన వారు తమకు తిరిగి డబ్బులు చెల్లించాలంటూ కోర్టుకు వెళ్లారు.

కోకాపేట భూములకు భారీ ధర
సుప్రీంతీర్పు హెచ్ఎండిఎకు అనుకూలంగా రావడం ప్రభుత్వానికి పెద్ద ఊరట. కోకాపేటలోని 100,109, 116, 117, 147 సర్వే నంబర్లలో 617.06 ఎకరాల ప్రభుత్వ భూములను 2006లో హెచ్‌ఎండీఏకు కేటాయిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఆ తరువాత ఉత్తర్వులు జారీ చేసింది. 2006, 2007లో హెచ్‌ఎండీఏ వేలం వేసింది. ఎకరా రికార్డు స్థాయిలో రూ.14.5 కోట్లకు అమ్ముడైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా కూడా భూముల ధర ఇంతగా పలికిన దాఖలాలు లేవు. 69ఎకరాలు వేలం వేస్తే రూ.703 కోట్లు ధర పలికింది.

కోకాపేట భూములపై కేసు
కోకాపేటలో భూములను కొనుగోలు చేసిన 15సంస్థలు దాదాపు రూ.420 కోట్ల వరకు హెచ్‌ఎండీఏకి చెల్లించాయి. అయితే తర్వాత కథ కొత్త మలులుపు తిరిగింది. కోకాపేటలో మొత్తం గ్రామకంఠంతో కలిపి 1635 ఎకరాల భూమి తమకే చెందుతాయని కేఎ్‌సబీ ఆలీ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు.హెచ్ఎండిఎ వేలం పాటలో భూములు దక్కించుకొన్న 15 సంస్థలు ఒకేసారి షాక్‌కు గురయ్యాయి.

4.అసలు వివాదమిదే
తమ ముత్తాత నుస్రత్ జంగ్ జాఫర్ 1906లోనే నిజాం నుంచి కొనుగోలు చేశాడని కెఎ సబీ కేసు వాదిస్తున్నాడు. 1954లో అతియత్ కోర్టు విచారణ జరిపి గ్రామంలోని భూములన్నీ తమవేనని తీర్పునిచ్చిందని కెఎ సబీ అంటున్నారు.. ఈ మేరకు రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని హైకోర్టుకు వెళ్లాడు. గ్రామంలో అప్పటికే నిర్మాణాలు వచ్చినందున ఖాళీగా ఉన్న 758 ఎకరాలు తమకు కేటాయించాలని కోరారు. మిగతా భూమికి ఫ్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలన్నాడు. వేలం రద్దు కుదరదని టైటిల్‌పై వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సంబంధిత ఫోరంను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది.

ఈ భూములు ఎవరివో తేల్చాలని ప్రభుత్వాన్ని కోరిన కోర్టు
టైటిల్‌పై పలు కోర్టుల్లో 6 కెఎ సబీ కేసులు వేశాడు. మెమో, జీవోల ద్వారా భూములు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్లకు నోటీసులివ్వకుండా మెమో జారీ చేయడం తప్పంటూ రద్దు చేసింది. గ్రామంలో ఖాళీగా ఉన్న 758 ఎకరాలు ఎవరివో తేల్చాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం పిటిషనర్లకు నోటీసులు జారీ చేసి చివరకు ఇవి ఫ్రభుత్వ భూములుగానే నిర్ధారిస్తూ రికార్డుల్లో నమోదు చేసింది. దీనిపై పిటీషనర్లు హైకోర్టుకు వెళ్లారు. 2012లో ఈ భూములపై ప్రభుత్వానికే హక్కు ఉందని హైకోర్టు తీర్పునిచ్చింది.

రిజిస్ట్రేషన్ చేయకుండా స్టే
హెచ్‌ఎండీఏ అధికారులు భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధ్దమవుతుండగా పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. భూములు ప్రభుత్వానికే చెందుతాయనేందుకు అవసరమైన పత్రాలను జిల్లా అధికార యంత్రాంగం సుప్రీంకోర్టుకు అందచేసింది. జాగీర్ భూములు కావని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 75ఏళ్ల నుంచి రికార్డుల్లో కోకాపేట కూడా రైతువారీ గ్రామంగానే ఉందని అధికారులు నివేదించారు. సుప్రీంకోర్టు చివరకు ఫ్రభుత్వానికి అనుకూలంగా బుధవారం తీర్పునిచ్చింది.

హెచ్‌ఎండీఏకు భారీ ఆదాయం
వేలకోట్ల విలువచేసే కోకాపేట భూములు ప్రభుత్వానివేనని తీర్పు నివ్వడంతో హెచ్‌ఎండీఏ కార్యాలయలో అధికారులు సంబరాలు జరుపుకున్నారు.రూ.12వేలకోట్ల విలువ చేసే భూములపై హక్కులు హెచ్‌ఎండీఏకుదక్కాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ను, ఔటర్ రింగు రోడ్డును అనుకొని ఉన్న కోకాపేటలో హెచ్‌ఎండీఏకు 638 ఎకరాలు క్లియర్ టైటిల్ ఉన్నట్లు సుప్రీం కోర్టులోనూ రుజువు కావడంతో భారీఆదాయం వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications