ములుగు జిల్లా రద్దు చేయం: మంత్రి సీతక్క క్లారిటీ
తెలంగాణలో జిల్లాల పునర్విభజన చేపడతామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఈ జిల్లాలను ఏర్పాటు చేసిందని, రాబోయే రోజుల్లో హేతుబద్ధంగా పునర్విభజన చేపడతామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. దీనికోసం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో త్వరలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో పలు జిల్లాలు రద్దు అవుతాయని విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కూడా రద్దవుతోందని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు.
"ములుగు జిల్లా ఏర్పాటు కోసం పోరాడిన వాళ్లం. అలాంటిది ములుగు జిల్లాను ఎందుకు రద్దు చేస్తాం..? టీఆర్ఎస్ హయంలో నూతన జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది. పాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అస్తవ్యస్తంగా జిల్లాల సరిహద్దులను నిర్ణయించారు. ఒక మండలం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలన్నది ప్రజల కోరిక" అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
"ములుగు జిల్లాలో ఒక మండలం ఉంటుంది. అందులోని ఐదు గ్రామాలు పక్కన భూపాలపల్లి జిల్లాలో ఉంటాయి. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయి. రెవెన్యూ, పోలీసు సరిహద్దులు ఒకేలా ఉండాలి. కానీ ఆ విధానాన్ని కేసీఆర్ అవలంబించలేదు. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అభివృద్ధి పరమైన సమీక్ష సమావేశాల సంబంధించి ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం గారు చెప్పారు" అని మంత్రి సీతక్క తెలిపారు.

"ములుగు జిల్లా ఏర్పాటు నచ్చని వాళ్లే ములుగు జిల్లా రద్దవుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ములుగు జిల్లా ప్రజలు నమ్మి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తుంది. అలాంటప్పుడు ములుగు జిల్లా రద్దు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ములుగు ప్రజలు ఎవరు ఆందోళన పడొద్దు. ములుగు జిల్లా ఎక్కడికి పోదు.. ఇక్కడే ఉంటుంది.. అభివృద్ధి పథంలో అగ్ర భాగాన నిలుస్తుంది" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications