750 మంది చనిపోయారంటే ఆయన ఎంత గొప్ప నేతనో తెలుస్తోంది: షర్మిల
నిజామాబాద్: 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక, ఆ విషయం తెలిసి 750 మంది మృతి చెందారని, ఈ రోజు వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఓ నాయకుడు చనిపోతే ఇలా వందల గుండెలు ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదని వైసిపి మహిళా నాయకురాలు వైయస్ షర్మిల శుక్రవారం అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ఈ రోజు ముగిసింది. గాంధీరి పోతంగల్ కలాన్ గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు (పరామర్శిస్తామని) చాలా సంతోషంగా ఉందన్నారు.
వైయస్ చనిపోయిన విషయం తెలియగానే 750 మంది ఆయన వెనకాలే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. దీనిని బట్టే వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతటి గొప్ప ప్రజా నాయకుడో అర్థమవుతోందన్నారు.

తండ్రీబిడ్డల అవసరాలు తీర్చినట్లుగా ప్రజల అవసరాలు తీర్చిన గొప్ప సీఎం వైయస్ అన్నారు. ఆ పదవికే గొప్ప అర్థం చెప్పారన్నారు. కుల, మత, ప్రాంత, వర్గం బేధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు.
మన, పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశారన్నారు. 23 జిల్లాల ప్రజల గుండెల్లో వైయస్ ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం... ఇలా వైయస్ పథఖాల్లో ఆయన జీవించే ఉంటారన్నారు.
వైయస్ చనిపోయి ఆరేళ్లయినా తెలుగు రాష్ట్రాలలో ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు కొనసాగడం వైయస్ గొప్పతనానికి నిదర్శనం అన్నారు. వైయస్ మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని పావురాలగుట్టలో జగన్ మాట ఇచ్చారని, దాని ప్రకారం తాము పరామర్శించామన్నారు.












Click it and Unblock the Notifications