బీజేపీకి గుడ్‌బై.. గులాబీ గూటికి మాజీఎంపీ రాపోలు ఆనంద భాస్కర్.. కేసీఆర్ తో భేటీ!!
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణాలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. మునుగోడు ఉపఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం కాగా, ఉప ఎన్నికల సమయంలో ఫిరాయింపు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు బిజెపికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. తాజాగా బిజెపి మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ కి రాపోలు ఆనంద భాస్కర్ గుడ్ బై
ఇప్పటివరకు బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. పద్మశాలి సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్టు అయిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చేనేత పై జిఎస్టి వేయడంతో బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేతన్నలకు బీజేపీ అన్యాయం చేస్తుందన్న రాపోలు
తాను నేత కుటుంబం నుంచి వచ్చానని, నేతన్నలకు బీజేపీ వల్ల జరుగుతున్న అన్యాయం చూడలేకపోతున్నా అని, బిజెపి చేస్తున్న ఈ నిర్వాకాన్ని భరించలేకపోతున్నాను అని ఆయన సీఎం కేసీఆర్ తో చెప్పినట్లుగా సమాచారం. చేనేత పై జిఎస్టి వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన సీఎం కేసీఆర్ కి తెలిపారు.

చేనేతలపై జీఎస్టీ వెయ్యటంతోనే రాజీనామా నిర్ణయం
ఇక ఇదే సమయంలో చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందని పేర్కొన్న రాపోలు ఆనంద భాస్కర్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి ద్వారా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని రాపోలు భాస్కర్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. త్వరలో బిజెపికి రాజీనామా చేస్తానని పేర్కొన్న ఆయన తన రాజీనామా వెనుక ప్రధాన కారణం చేనేతల పై జిఎస్టి వేయటమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications