అంతా భ్రాంతియేనా... పొత్తుపై చంద్రబాబు ఆశలు గల్లంతేనా?
తెలంగాణ రాష్ట్రం పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు అడియాసలేనా? తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్లడం కోసమే చంద్రబాబు తెలంగాణ పై ఫోకస్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి తెర పడినట్లేనా? ఒకవేళ వచ్చే ఎన్నికలలో టిడిపి పోటీ చేస్తే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో టీడీపీతో కలిసి వచ్చే పార్టీలే లేవా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అంతా భ్రాంతియేనా... పొత్తుపై ఆశలు గల్లంతేనా అని చంద్రబాబు పాడుకునే పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది.

తెలంగాణాలో రీ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు .. పొత్తులపై ఆసక్తికర చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం సభతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు తెలంగాణాపై ఫోకస్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . గత ఎన్నికల ఓటమి తర్వాత క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం కోసం చంద్రబాబు మళ్ళీ తెలంగాణాలో అడుగు పెట్టారు. పార్టీకి పునర్వైభావాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావిస్తూ తెలంగాణాలో వేస్తున్న అడుగులు తెలంగాణా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.
తెలంగాణాలో టీడీపీ ఎంట్రీ కేవలం బీజేపీతో పొత్తు కోసమే అన్న చర్చ ప్రధానంగా జరిగింది. ఏకంగా బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు, మంత్రులు, చంద్రబాబును టార్గెట్ చేసి ఈ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీజేపీ టీడీపీ పొత్తుపై తేల్చి చెప్పిన బండి సంజయ్
కేవలం బీజేపీతో పొత్తు కోసమే, ఎన్నికల రాజకీయాలలో భాగంగా చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు బిజెపి నేతలలో సైతం దీనిపై ఒక సందిగ్ధం నెలకొంది. నిజంగానే చంద్రబాబుతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందా ? అన్న అనుమానం బిజెపి నేతలలో సైతం వ్యక్తమైంది.
ఈ క్రమంలోనే తాజాగా బిజెపి సమావేశంలో బిజెపి సీనియర్లు మాజీ ఎంపీ విజయశాంతి, ఎంపీ అరవింద్ తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో క్లారిటీ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కోరారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని కార్యకర్తలకు కూడా చెప్పాలని ఆయన సూచించారు.

గతంలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు.. కాంగ్రెస్ కు నష్టం జరిగిందని చర్చ
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశలపై నీళ్లు పోసినట్లయింది. గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని విజయశాంతి ఈ సమావేశంలో గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదనే చెప్పాలి. గతంలో పొత్తు పెట్టుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, టీడీపీతో పొత్తు కారణమని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

తెలంగాణాలో టీడీపీకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీ .. అది కూడా చేజారినట్టేనా?
ఇక టీడీపీకి తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ బిజెపి. ప్రస్తుతం బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. మొదటి నుంచి కేసీఆర్ ను వ్యతిరేకించే చంద్రబాబు, కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే అవకాశం అంతకంటే లేదు. ఇక ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే ఒంటరిగా పోటీ చేయాల్సిందే తప్ప పొత్తుతో ముందుకు వెళ్లే ఛాన్స్ లేదని, తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం ఏం చేయబోతున్నారు అనేది అందరూ ఆలోచిస్తున్న విషయం.












Click it and Unblock the Notifications