విద్యుత్ ఛార్జీల పెంపు తర్వాత మరో షాక్: తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు, ఎంతంటే?
హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంతో రాష్ట్ర ప్రజలపై భారం పడగా, ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా బస్సు ఛార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డివిరిచింది. ప్యాసించర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5 చొప్పున.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10 వరకు టికెట్ రేట్లను పెంచింది.
పెంచిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంపుతో ఆందోళన చెందుతుంటే.. తాజాగా, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతారా? అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇలా అన్ని ధరలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఇటీవల రౌండప్ విధానాన్ని తీసుకొచ్చిన ఆర్టీసీ.. పల్లెవెలుగు బస్సు టికెట్ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్ల రేట్లను రౌండప్ చేసినట్లు తెలిపింది. రూ. 12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ. 10గా, రూ. 13, రూ. 14 ఉన్న టికెట్ ఛార్జీని రూ. 15గా చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ సిటీ బస్సుల్లో బస్‌పాస్ ఛార్జీలను పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్ బస్ టికెట్ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్-ఆర్టీసీ కోంబో టికెట్ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.












Click it and Unblock the Notifications