కేటీఆర్ పర్యటనలో గులాబీ నేతలకు ఝలక్: ఏకంగా మేయర్ సుధారాణికే షాకిచ్చిన బల్దియా
మంత్రి కేటీఆర్ పర్యటనలో గులాబీ పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు బల్దియా అధికారులు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కేటీఆర్ పర్యటన సందర్భంగా వరంగల్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లకు భారీ జరిమానాలను విధించారు. అనుమతిలేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏకంగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కి కూడా షాక్ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్ పర్యటన... వరంగల్ లో భారీ ఫ్లెక్సీలు.. షాక్ ఇచ్చిన బల్దియా
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వరంగల్ నగర వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేటీఆర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి నగరాన్ని గులాబీ మయం చేశారు. మడికొండ నుండి వరంగల్ వరకు జెండాలు, బ్యానర్లు, కటౌట్ లతో హడావిడి చేశారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కటౌట్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫ్లెక్సీల ఏర్పాటు పై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి భారీగా ఫైన్ విధించారు.

మేయర్ గుండు సుధారాణికి రెండు లక్షల రూపాయల ఫైన్
అనుమతి లేకుండా వరంగల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తో సహా పలువురికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గుండు సుధారాణి కి ఏకంగా 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఆమె అనుమతి లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొని జరిమానా నోటీసులను ఇచ్చారు అధికారులు. అలాగే టీఆర్ఎస్ నేత ఎంపీ కేశవరావుకు 50 వేల రూపాయలు జరిమానా విధించారు.

గతంలో మంత్రులకు, టీఆర్ఎస్ నేతలకు జీహెచ్ఎంసీ ఫైన్
రాష్ట్రవ్యాప్తంగా అనేక సందర్భాలలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, టిఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పై కూడా బల్దియా అధికారులు కొరడా ఝుళిపించిన అనేక సందర్భాలు ఉన్నాయి.
అటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అనేక సందర్భాలలో గులాబి నేతలకు భారీగా జరిమానాలు విధించారు. గతంలో టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ భారీ కటౌట్లను ఏర్పాటు చేసిన మంత్రులతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు జిహెచ్ఎంసి అధికారులు భారీ జరిమానాలు విధించారు.
కేటీఆర్ పర్యటనలో బిజీగా ఉన్న గులాబీ నేతలకు ఊహించని షాక్
ఇక ఇదిలా ఉంటే బుధవారం నాడు మంత్రి కేటీఆర్ నర్సంపేట, వరంగల్, హనుమకొండ లలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రాకతో పార్టీ శ్రేణుల లోనూ, కార్యకర్తలలోనూ జోష్ నెలకొంది. ప్రధానంగా వరంగల్, హనుమకొండ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి కేటీఆర్ వరంగల్లో పర్యటిస్తున్నారు. ఇక ఇదే సమయంలో కేటీఆర్ పర్యటనలో బిజీగా ఉన్న గులాబీ నేతలకు బల్దియా అధికారులు ఝలక్ ఇచ్చారు.