షాకింగ్: జస్ట్ మూడు గంటల్లో.. రూ.50 లక్షలు నొక్కేసిన నయా కి'లేడీ'లు!
హైదరాబాద్: జస్ట్ మూడంటే మూడు గంటల వ్యవధిలో దాదాపు 100 మంది అమాయకపు తల్లిదండ్రుల నుంచి రూ. 50 లక్షలు నొక్కేశారు కొందరు కి'లేడీ'లు. అంతకుముందు హైదరాబాద్ లోని సుజనా ఫోరం మాల్‌ను వేదికగా చేసుకుని గ్రౌండ్ వర్క్ చేశారు.
భాగ్యనగరంలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రిపబ్లిక్ డే రోజైన శుక్రవారం.. సుజనా ఫోరం మాల్‌లో చిన్న పిల్లలతో షాపింగ్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరినీ కొంతమంది యువతులు పలకరించారు.

పిల్లలు బాగున్నారని, యాడ్ ఫిల్మ్ కు సరిపోతారని, ఒప్పుకుంటే.. ఫొటో సెషన్ ఉచితంగా చేసి, యాడ్స్ సంస్థలతో కాంట్రాక్టులు కుదురుస్తామని చెప్పారు. ఇంకేముంది పలువురు తల్లిదండ్రులు ఎగరి గంతేశారు. వారి మాయమాటలకు పడిపోయి తమ ఫోన్ నంబర్లను వారికి ఇచ్చారు.
ఇక ఆ మరుసటి రోజే ఫోన్ నంబర్లు ఇచ్చిన వారందరికీ ఫోన్లు వెళ్లాయి. బంజారాహిల్స్ లోని ఓ ఫొటో స్టూడియోకు మీ పిల్లలను తీసుకుని సూచించడంతో దాదాపు 100 మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్కడికి చేరుకున్నారు. ఫొటో సెషన్ కూడా జరిగింది.
ఆ తరువాతే అసలు కథ నడిచింది. ఒక్కొక్కరినీ పిలిచి, 42 యాడ్ ఏజెన్సీలకు పిల్లలు ఎంపికయ్యారని, రెండేళ్ల కాంట్రాక్టుకు రూ. లక్ష, నాలుగేళ్లకు రూ. 2 లక్షలు, ఆరేళ్లకు రూ. 4 లక్షలు, ఎనిమిదేళ్లకు రూ. 6 లక్షలు తమకు కమీషన్ కట్టాలని ఆ యువతులు చెప్పారు.
కాస్త డైలమాలో పడిన తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పారు. పిల్లల చేత మోడలింగ్ చేయించి లక్షలు సంపాదించుకోవచ్చని ఆశ జూపారు. పలువురు తల్లిదండ్రులు వారి మాటలకు కన్విన్స్ అయ్యారు. ఇది తమను వెతుక్కుంటూ వచ్చిన అవకాశమన్న భావనతో ఆ యువతులకు డబ్బు చెల్లించారు.
అంతే - ఆ తరువాత నుంచి అక్కడ ఫొటో స్టూడియో ఉందిగానీ, ఆ యువతులు మాత్రం కనిపించలేదు. బాగా ఆరా తీస్తే.. ఆ ఫొటో స్టూడియోను వారు రెండు రోజులపాటు అద్దెకు తీసుకున్నారని తెలిసింది. అంతే వారి కళ్లకు కట్టిన 'మోడలింగ్' పొరలు విడిపోయాయి. ,
తాము మోసపోయామని అర్థంకాగానే లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మూడు గంటల వ్యవధిలో ఫొటో సెషన్ చేసేసి, దాదాపు రూ. 50 లక్షల వరకూ ఆ కిలేడీలు దండుకున్నారని పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం పోలీసులు ఆ కిలేడీల ఆచూకీ కోసం సుజనా ఫోరం మాల్ సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. మోడలింగ్ కాంట్రాక్టుల పేరుతో ఇంతమంది తల్లిదండ్రులను మోసగించిన ఆ యువతులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications