ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలో షాకింగ్ ట్విస్ట్, రేవంత్ కింకర్తవ్యం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి కావలసి ఉండగా పలు జిల్లాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే చివరి దశలో ఉంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో సర్వే అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించి సంబంధిత దరఖాస్తుదారుల వివరాలను ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ లో నమోదు చేస్తున్నారు.
మా దరఖాస్తులు ఎక్కడ? సర్వే అధికారులకు ఇందిరమ్మ అర్జీదారుల ప్రశ్న
అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 80,54,554 దరఖాస్తులు వచ్చాయని, ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే సర్వే నిర్వహిస్తున్నారని మంత్రులు, అధికారులు తెలుపుతున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది, సర్వే అధికారులు తమ ఇళ్లకు రావడంలేదని లబోదిబోమంటున్నారు. ప్రజాపాలన దరఖాస్తులలో భాగంగా తాము దరఖాస్తు చేశామని అయినప్పటికీ అధికారులు తమ స్థలాలను సర్వే చేయడం లేదని వారు వాపోతున్నారు.

గ్రేటర్ వరంగల్ లో అర్జీదారుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టుకున్న అర్జీలు గల్లంతయినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే అర్జీల గల్లంతుతో గందరగోళం చోటుచేసుకుంది. నగరంలో ప్రజా పాలనలో ఇచ్చిన అర్జీలు ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్, మాన్యువల్ జాబితాలో కనిపించకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
గ్రేటర్ వరంగల్ లో 18 వేల దరఖాస్తులు గల్లంతు
ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు తమ పేర్లు గల్లంతయ్యాయని దరఖాస్తుదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటువంటి వాటిని రీ ఎంట్రీ చేసేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులకు గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే లేఖ రాశారు. గృహ నిర్మాణ శాఖ ఎమ్.డి వీ పి గౌతమ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టుకున్న అర్జీలు గల్లంతు కావడంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని సుమారు 18 వేల మంది అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్జీల గల్లంతుపై ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఒక్క గ్రేటర్ వరంగల్ లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు గల్లంత అయ్యాయన్న దరఖాస్తుదారుల ఆవేదనను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మళ్లీ వీరందరి దరఖాస్తులను రీఎంట్రీ చేసుకొని సర్వే నిర్వహించాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు. అయితే ఇప్పటికే సర్వే చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. తమ అర్జీలు గల్లంతయ్యాయి మహాప్రభో అని వేడుకుంటున్న సామాన్య ప్రజల గోడు ప్రభుత్వం పట్టించుకుంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications