గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై రంగంలోకి ఆరుగురు ఉన్నతాధికారుల కమిటీ
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటన 17మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ అతిపెద్ద అగ్ని ప్రమాద ఘటనకు గల కారణాలను లోతుగా విచారించడానికి, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఆరుగురు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
ఆరుగురు సీనియర్ అధికారులతో కమిటీ
హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ నేడు ఈ కమిటీ వివరాలను వెల్లడించారు. ఈ కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ఉన్నారు.

సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
అలాగే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవి రంగనాథ్, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సభ్యులుగా ఉన్నారు . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే కుటుంబానికి చెందిన 17మంది మృతి చెందిన ఈ దారుణ దుర్ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసే సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వ కీలక నిర్ణయాలు
భవిష్యత్తులో ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఇక కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి తరువాత చర్యల పైన నిర్ణయం తీసుకోనున్నారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి
ఈ కమిటీ ద్వారా భవిష్యత్తులో ఇటువంటి దారుణ ఘటనలు జరగకుండా తగు చర్యలను తీసుకోవడం, ఆ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.అయితే ఈ ఘటనకు అక్రమ విద్యుత్ కనెక్షన్లు కారణం అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications