దక్షిణ మధ్య రైల్వే కుదింపు - ఈ స్టేషన్లు, ప్రధాన రైళ్లు ఇక నుంచి..!!
తెలుగు రాష్ట్రాల కేంద్రంగా రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విశాఖ రైల్వే జోన్ పరిధి పైన స్పష్టత వచ్చింది. దీంతో, దక్షిణ మధ్య రైల్వే పరిధిని కుదింపు పైన అధికారికంగా నిర్ణయం వెల్లడించేందుకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి పునర్విభజన పైన కీలక ప్రతిపాదనలు సమర్పించారు. డివిజన్ల విభజన, సరిహద్దుల్లో మార్పులు, ఆదాయంతో పాటు రైళ్ల నిర్వహణ పైన రైల్వే శాఖ నిర్ణయించింది.
దక్షిణ మధ్య రైల్వే లో పాలనా వ్యవహారాల్లో కీలక మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఈ జోన్ పరిధిలో ఉన్న డివిజన్లు తగ్గనున్నాయి. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌లకే పరిమితం కానుంది. తాజా పరిధి జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. జోన్ పరిధి 6,637 ట్రాక్ కిలో మీటర్ల నుంచి 3,589 ట్రాక్ కిలో మీటర్లకు పరిమితం కానుంది. ఏపీలో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ జూన్1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో.. విశాఖ కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు చేర్చారు. గుంటూరు డివిజన్‌లో ఉన్న పగిడిపల్లి-విష్ణుపురం-జాన్‌పహాడ్, అలాగే గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూరు-వాడి సెక్షన్ సికింద్రాబాద్ డివిజన్‌లో విలీనం అవుతాయి. కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు లో భాగంగా రెండు జోన్ల అధికారులు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగుల కేటాయింపు పూర్తి... జూన్ 1 నుంచి అమలు
తాజా నిర్ణయం మేరకు సికింద్రాబాద్ డివిజన్ పరిధి 204 కిలో మీటర్ల మేర పెరగనుంది. దీంతో రైళ్ల రాకపోకలు, సిగ్నలింగ్ సమన్వయం వంటి అంశాల్లో మరింత ఒత్తిడి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త రైల్వే జోన్ కోసం ఇప్పటికే జనరల్ మేనేజర్, ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ పోస్టుల్లో సంబంధిత అధికారులను నియమించగా వారు ఇప్పటికే విధుల్లో చేరారు. దక్షిణ కోస్తా జోన్‌కు 128 గెజిటెడ్, 1,100 నాన్‌గెజిటెడ్ అధికారుల పోస్టులను రైల్వేబోర్డు ఇటీవల మంజూరు చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి కొత్త జోన్‌కు పోస్టులు భారీగా బదిలీ అయ్యాయి. ఇక.. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు కొత్తగా వాల్తేరు డివిజన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్‌తో కలిపి మొత్తం నాలుగు డివిజన్లతో కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.













Click it and Unblock the Notifications