తెలంగాణలో అల్పపీడన ప్రభావం: రెండ్రోజులపాటు భారీ వర్షాలు, ఆ జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రమట్టం నుంచి 7.6 కీ.మీ ఎత్తువరకు విస్తరించి ఉంది. ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా 31 డిగ్రీల వరకు ఉంటాయని, సాయంత్రం వాతావరణ పరిస్థితులు మారతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, గత శనివారం నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆదివారం మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 5 సెంటీమీటర్లు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చల్లని వాతావరణమే ఉంది.












Click it and Unblock the Notifications