టార్గెట్ 2023: తెలంగాణలో స్టార్‌వార్: కేటీఆర్..రేవంత్ రెడ్డి..షర్మిల: ఆటంబాంబ్‌లా పాలిటిక్స్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి నెలకొంది..కొత్త తరం నాయకులు తెరమీదికి వచ్చారు. కొత్త రక్తం ప్రవహించడం ఆరంభించినట్టే. దాదాపు ఒకే వయస్సున్న ఉన్న యువ నేతలు కేటీఆర్, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల.. 2023 అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తోండటంతో రాజకీయ రంగం ఆటంబాంబ్‌లా మారింది. పోటీ రసవత్తరంగా తయారైంది. యంగెస్ట్ స్టేట్‌గా పేరున్న తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు, అస్త్రశస్త్రాలతో సమాయాత్తమౌతోన్నారా ఆ యువనేతలు. ఈ పరిణామాలు త్రిముఖ పోరుకు తెర తీసినట్టయింది.

ఉద్యమ నేపథ్యం నుంచి..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన యువ నాయకుడు కేటీఆర్. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వారసత్వంగా రాజకీయాలను సాగిస్తోన్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే.. కేటీఆర్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించే అవకాశాలను కొట్టి పారేయలేం. ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలను స్వీకరిస్తారంటూ ఇదివరకే లీకులు సైతం వెలువడ్డాయి. దీన్ని టీఆర్ఎస్ అగ్రనాయకత్వం తోసిపుచ్చినప్పటికీ అది తాత్కాలికమే. అధికార టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, మంత్రిగా కేటీఆర్ తన సత్తాను నిరూపించుకున్నారు కూడా. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి ఎదురైనా.. అవే పొరపాట్లు నాగార్జున సాగర్‌లో పునరావృతం కానివ్వలేదు.

వృద్ధ పార్టీకి యువ నేతగా..
వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేతికి అందాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం ఓ సంచలనానికి దారి తీస్తోన్నట్టే కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలను ఇంకా స్వీకరించకముందే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నారు. ప్రత్యేకించి- మీడియా అధినేతలను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో తన గురువు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో ఆయన నడుస్తోన్నారనేది స్పష్టమౌతోంది. తన కంటే సీనియర్ నేతలు చాలామంది ఉన్న కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఎలా నెగ్గుకొస్తారనే అనుమానాలకు ఆయన తెర దించినట్టయింది కూడా.

వైఎస్ షర్మిల ఎంట్రీతో..
ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల అడుగు పెట్టబోతోండటం మరో సంచలనం. ఇక్కడ కూడా వారసత్వ రాజకీయమే కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఛరిష్మా అనే ఒకే ఒక్క నినాదమే వైఎస్ షర్మిలకు ఆధారంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహించిన వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే షర్మిల పార్టీకి పునాది. తన తండ్రి ఆశయాలను సాధించడం, తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకుని రావాలనే లక్ష్యంతో ఆమె పార్టీని స్థాపించారు. గురువారం తన పార్టీని అధికారికంగా ప్రకటించడానికి సమాయాత్తమౌతోన్నారు.
Recommended Video

పీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం మరుసటి రోజే..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే వైఎస్ షర్మిల తన పార్టీని అధికారికంగా ప్రకటించబోతోండటం యాదృచ్ఛికమే. ఈ రెండు పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో యువనేతల ప్రాధాన్యతను చాటిచెప్పబోతోంది. కేటీఆర్..రేవంత్ రెడ్డి..వైఎస్ షర్మిల-ఈ ముగ్గురిలో ఎవరు ప్రజాదరణను పొందుతారు? ఎవరు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించగలుగుతారనేది తేలాలంటే ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. వైఎస్ షర్మిల కింగ్ మేకర్‌లా మారే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పాత్రను పోషిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications