'ఆకలి' రాయలేకపోయిన విద్యార్థులు.. ఇవేనా మన విద్యా ప్రమాణాలు!!
ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్యను బోధిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు విద్యార్థులకు ఉత్తమంగా విద్యా బోధన అందించటంలో ఫెయిల్ అవుతున్నాయా? ఉన్నత పాఠశాల విద్యార్థులలో విద్యా ప్రమాణాలు రోజురోజుకీ తగ్గుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయా? తెలుగు అసలే రాయడం రాని విద్యార్థుల తీరు ఇప్పడు ఆందోళన కలిగిస్తుందా? అంటే అవును అనే అంటున్నారు పిల్లల చదువులను చూస్తున్న పేరెంట్స్ . ప్రభుత్వాలు స్కూల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఆకలి పదాన్ని రాయలేకపోయిన విద్యార్థులు
ఇంతకీ ఈ చర్చకు ప్రధాన కారణం ఏమిటి అంటే ఇటీవల బాలాపూర్ మండలంలోని మీర్ పేట సిర్లా హిల్స్ లోని ప్రభుత్వ పాఠశాల ఏడవ తరగతి విద్యార్థులు ఆకలి అనే పదాన్ని రాయలేకపోయారు. పాఠశాలను డీఈఓ సురేందర్ రావు సందర్శించి, విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అన్నదానిపై పరిశీలన జరుపుతున్న క్రమంలో విద్యార్థుల తీరుకు ఆయన షాక్ అయ్యారు. ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పిలిచి ఆకలి అనే పదాన్ని బోర్డుపై రాయమని చెప్పారు. దీంతో సదరు విద్యార్థి బిక్కమొహం వేసి రాయకుండా అలాగే నిలుచున్నాడు. ఇక తరగతిలోని ఇద్దరు ముగ్గురు విద్యార్థులను పిలిచి రాయమన్నా ఎవరూ రాయలేదు.

విద్యా ప్రమాణాలకు పెద్ద పీట ఇదేనా?
మాతృభాషలోని తేలికైన పదాలని రాయలేక పోతున్న విద్యార్థుల తీరుతో డీఈవో ఉపాధ్యాయులను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మీరు ఏం బోధిస్తున్నారు అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. మళ్లీ మరోసారి వస్తానని, ఈసారి వచ్చేసరికి విద్యార్థుల్లో మార్పు రావాలని డీఈవో ఉపాధ్యాయులకు సూచించి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ సర్కార్ చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని తాజా ఘటనతో వ్యక్తమవుతుంది.

తెలంగాణా ప్రభుత్వానికి విద్యపై కీలక సూచనలు చేసిన రిటైర్డ్ ఐఏఎస్
ఇక ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సీఎం పట్టించుకోవాలి అంటూ పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల పిల్లలకు కూడా కనీసం తెలుగు చదవడం కూడా రాని పరిస్థితి ఉందని, ఈ నేపథ్యంలో విద్యా శాఖను సీఎం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బయట సంస్థతో పిల్లల లెర్నింగ్ అవుట్ కమ్స్ ను మూల్యాంకనం చేయించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణా రాష్ట్రంలో స్కూల్స్ లో ముందు ఆ పని చెయ్యాలని విజ్ఞప్తి
కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో రివ్యూలు, పర్యవేక్షణలు చేయాలని పేర్కొని, విద్య సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది అంటూ ఆకునూరి మురళి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్, ఆ పని చేయాలని ఆకునూరి మురళి సూచించారు. ఈ క్రమంలోనే ఆయన ఆకలి పదాన్ని కూడా రాయలేని విద్యార్థుల చదువులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవేనా మన విద్యా ప్రమాణాలు అని అందరూ ఆలోచించేలా చేశారు.












Click it and Unblock the Notifications